తెలంగాణలో బీజేపీ ఇప్పుడున్న పరిస్దితులను తమకు పూర్తిగా కలసివచ్చేలా మార్చుకుంటుంది. అందుకోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రారంభించింది. ఈ దశలో అందివచ్చిన అవకాశాలను అస్సలు వదులుకోవడం లేదు. పైగా రాష్ట్ర గవర్నర్ స్వయంగా తమ పార్టీకి చెందిన నేత కావడంతో అధికార పార్టీని ఇరుకున పెట్టడం మరింత సులభమని భావిస్తోంది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె ఆరో రోజుకు చేరింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సమ్మెను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆర్టీసీ అభివృద్ది పేరుతో మూడు రకాల వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోంది.


ఇప్పటికే ఆర్టీసీ సమ్మెపై తన వైఖరిని ముఖ్యమంత్రి వెల్లడించారు. మరోవైపు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు వైద్యాన్ని కూడా నిలిపివేయడంతో పరిణామాలు తీవ్రంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడిపెంచేందుకు విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. సమ్మె రాజ్యాంగ బద్ధంగానే చేస్తున్నామని, ఏ ఒక్క ఉద్యోగి తమ ఉద్యోగం కోల్పోయే పరిస్థితి లేదని కార్మికులకు విపక్షాలు భరోసా ఇస్తున్నాయి. ఇక ఈ దశలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన భాజపా నాయకులు గురువారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.


ఆర్టీసీ కార్మికుల సమ్మెపై, ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను గవర్నర్‌కు వివరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ,రవాణా శాఖ మంత్రి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపకుండా, సీఎం స్పందించకుండా కార్మికులు సమ్మెకు దిగిన వెంటనే వారు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్రకటించడం దారుణమన్నారు. తెలంగాణ ఆస్తులను దోచుకునేందుకు ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టి, తమకు కావాల్సిన ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీని కట్టబెట్టడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు.


అంతే కాకుండా బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం, 50వేల మంది కార్మికులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, ప్రభుత్వం కొన్ని పన్నులు తగ్గిస్తే ఆర్టీసీ లాభాల బాటలో ఉంటుందని తెలంగాణ ఉద్యమం సందర్భంగా డిమాండ్ చేసిన కేసీఆర్, ఇప్పుడు ఎందుకు దాన్ని అమలు చేయడం లేదని  లక్ష్మణ్ ప్రశ్నించారు. ఏది ఏమైన ఈ సమ్మే ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై చాలా ఎక్కువగానే పడుతుంది.ఈ సమ్మెతో ఇప్పటికే ఆర్టీసికి, భారీగా నష్టం వాటిల్లగా,  నరకం కనిపిస్తుందని ప్రజలు వాపోతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: