అధికార పార్టీలో ఉంటూ...ఏ పదవి లేకుండా ఉంటే ఏ సీనియర్ నేతకైనా కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. అవసరమైతే అలకపాన్పు ఎక్కి పార్టీలో కూడా పెద్ద యాక్టివ్ గా ఉండరు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీ వైసీపీలోని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి ఎదురైంది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పార్థసారథి గత కొన్ని రోజులుగా మునుపటిలా దూకుడు ప్రదర్శించడం లేదు. మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి...మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే కాంగ్రెస్ తరుపున సారథి 2004లో వుయ్యూరు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పెనములూరు నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత వైఎస్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఆ ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో పెనమలూరు నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.


సీనియారిటీ ఉండటం, గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉండటంతో సారథి తనకు మంత్రి పదవి రావడం ఖాయమని అనుకున్నారు. కానీ జగన్ అనూహ్యంగా సారథి సామాజికవర్గానికి చెందిన యువనాయకుడు నెల్లూరు సిటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు మంతి పదవి కట్టబెట్టారు. అటు తన సొంత జిల్లా కృష్ణాలో కొడాలినాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ లకు మంత్రి పదవులు ఇచ్చేశారు.  దీంతో సారథి ఆశలు అడియాసలయ్యాయి. అప్పటి నుంచి పార్టీలో పూర్తిగా యాక్టివ్ గా ఉండటం లేదు.


అయితే పరిస్థితిని గమనించిన సీఎం జగన్ సారథికి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. కానీ ఈ లోపు ఏమనుకున్నారో ఏంటో సారథి ఆ విప్ పదవిని వద్దని తిరస్కరించారు. ఆ పదవిని అదే కృష్ణా జిల్లాకు చెందిన సామినేని ఉదయభానుకు ఇచ్చారు. ఈ క్రమంలోనే సారథికి ప్రాంతీయ అభివృద్ధి మండలి ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ జగన్ ఇంకా ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళని ఏర్పాటు చేయలేదు. దీంతో సారథి సైలెంట్ అయిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనబరిచిన దూకుడు అధికారంలోకి వచ్చాక చూపించడం లేదు. మరి రానున్న రోజుల్లో అయిన పార్థసారథికి జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తారేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: