ఆరోగ్య శ్రీ....ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పేరు వైఎస్సార్. ఎన్ని ప్రభుత్వాలు మారినా,పథకం పేరు మారినా వైఎస్సార్ పెట్టిన ఆరోగ్య శ్రీనే ఇప్పటికీ ఏపీ, తెలంగాణలలో కొనసాగుతుంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో తన తనయుడు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్21న ప్రారంభించారు. వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని నిరుపేదలలకు ఈ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించారు. ఈ పథకం వలనే వైఎస్ ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.


అయితే అదే ఆరోగ్యశ్రీని వైఎస్సార్ తనయుడు,ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆరోగ్యశ్రీలో పెద్ద ఎత్తున మార్పులు చేసి జగన్ అన్నీ వర్గాల ప్రజలకు అందేలా చర్యలు చేపట్టారు. తాజాగా రాష్ట్రంలో అంధత్వాన్ని నివారించేందుకు జగన్ వైఎస్సార్ కంటివెలుగు పేరిట ఓ పథకాన్ని ప్రారంభించిన జగన్....అతి త్వరలోనే ఆరోగ్యశ్రీలో కొన్ని మార్పులు చేసి ప్రజలకు అందించనున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటాని తయారు చేసి...ఆ డేటాని ఆరోగ్యశ్రీ కార్డు రూపంలో ఇవ్వనున్నారు. ఈ కార్డులో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి.


ఈ కొత్త కార్డుల పంపిణీ తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్21 న చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1000 వ్యాధులు ఉన్నాయి. వాటిని ఇప్పుడు 2000 వేల వ్యాధులకు పెంచి, మొదట పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరిలో అమలు చేసి, తర్వాత మిగతా జిల్లాల్లో కూడా అమలు చేస్తారు. అలాగే ఆరోగ్యశ్రీలో డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా చేరుస్తున్నారు. అటు పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఏపీ ప్రజలు వైద్యం చేయించుకునే సదుపాయం కూడా కల్పించనున్నారు.


అయితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టినప్పుడు ప్రజలకు ఇన్ని రకాలు వసతులు అందలేదు. కొన్ని రకాల జబ్బులకే, కొన్ని ఆసుపత్రులకే ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించారు. కానీ ఇప్పుడు జగన్ పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడే ప్రతి వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు కృషి చేస్తున్నారు. మొత్తం 2000 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించనున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో జగన్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటారనే చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: