తమకు 50  వేలు జీతాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు . ఆర్టీసీ కార్మికులకు ఎవరికీ కూడా  50  వేల జీతాలు రావడం లేదని ,  ఒకవేళ ప్రభుత్వం  50  వేల జీతం ఇస్తామంటే తక్షణమే సమ్మె విరమిస్తామని చెబుతున్నారు . ఆర్టీసీ కార్మికులకు 50  వేల జీతాలు వస్తున్నాయని, అయినా సమ్మె చేయడం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించిన విషయం తెల్సిందే . ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆర్టీసీ కార్మికులకు సోషల్ మీడియా వేదికగా తూర్పారబడుతున్నారు .


తమకు 50  వేల జీతాలు రావడం లేదని, అన్ని కటింగ్స్ పోను కేవలం 20 వేల రూపాయలు మాత్రమే చేతికి వస్తున్నాయని ఓ మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు . తమ పిల్లలు అనారోగ్యం పాలైతే కనీసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు . అయినా కేసీఆర్ మాత్రం అబద్దాలను ప్రచారం చేస్తూ , ప్రజల్లో ఆర్టీసీ కార్మికులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు . తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తమ బ్రతుకులు బాగుపడుతాయని భావించామని ,కానీ  కేసీఆర్ ... తమను రోడ్డుపాలు చేశారని ధ్వజమెత్తుతున్నారు . పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగా, లేనిది  ధనిక రాష్ట్రమైన తెలంగాణ లో ఎందుకు చేయరో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు .


 తెలంగాణ కోసం తాము కొట్లాడలేదా ?, ఒక్క కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందా ? అంటూ ప్రశ్నిస్తున్నారు . ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది . నెటిజన్లు కూడా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరుతున్నారు . ఎవరు అడిగారని ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల జీతభత్యాలు పెంచారని , ఆర్టీసీ కార్మికులు తమ జీతభత్యాలు పెంచాలని  కోరుతున్న ఎందుకు పెంచడం లేదో కేసీఆర్  చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు .   


మరింత సమాచారం తెలుసుకోండి: