మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో మ‌రాఠాల పార్టీ అయిన శివ‌సేన‌,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ పొత్తుతో శివ‌సేన‌కు ఊహించ‌ని షాక్ త‌గులుతోంది. బీజేపీ కార‌ణంగా ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన 26 మంది కార్పొరేటర్లు, దాదాపు 300 మంది కార్యకర్తలు శివసేనకు రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ పంపారు. ఎన్నికల వేళ శివసేన పార్టీకి ఊహించ‌ని షాక్ అని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను 150 సీట్లు బీజేపీకి, 124 సీట్లు శివసేనకు దక్కాయి. మిగిలిన 14 సీట్లను చిన్న భాగస్వామ్య పార్టీలకు కేటాయించారు. ముంబైలో ఓ సంయుక్త మీడియా సమావేశంలో శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే, మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ వివరాల్ని వెల్లడించారు. అయితే పొత్తులో భాగంగా కల్యాణ్‌ తూర్పు నియోజకవర్గం సీటు బీజేపీకి వెళ్లింది. దీనిని నిరసిస్తూ వీరంతా రాజీనామా చేశారు. వీరిలో 16 మంది కార్పొరేటర్లు కల్యాణ్‌ దోంబివాలి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందినవారు ఉన్నారు. భారీ ఎదురుదెబ్బ నేప‌థ్యంలో...ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి ఓట‌మి ఖాయ‌మంటున్నారు.


కల్యాణ్‌ తూర్పు నియోజకవర్గం టికెట్‌ను శివసేన నాయకుడు ధనంజయ్‌ బోదరే ఆశించారు. కానీ ఈ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయనుండటంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు. మ‌రోవైపు, పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఒకరైన శరద్‌ పాటిల్‌ మాట్లాడుతూ ‘కల్యాణ్‌ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేయనున్నారని, ఆయనకు శివసేన కార్యకర్తలు మద్దతుగా నిలువాలని పార్టీ కోరింది. ఇది మాకు నచ్చలేదు. అందుకే రాజీనామా లేఖ పంపాం’ అని తెలిపారు. కాగా రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో బీజేపీ 150 చోట్ల, శివసేన 124 చోట్ల పోటీ చేయనున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: