తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక కృత్రిమ కొరతకు నిరసనగా మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద దీక్ష చేపట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కొల్లు రవీంద్ర చేపట్టిన 36 గంటల దీక్షను భగ్నం చేశారు. పోలీసులు మొదట గృహ నిర్భంధం చేయాలనే ఆలోచనతో కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లారు. 
 
కొల్లు రవీంద్ర నివాసానికి పోలీసులు వెళ్లక ముందే కొల్లు రవీంద్ర వేరే మార్గంలో కోనేరు సెంటర్ కు చేరుకున్నారు. కోనేరు సెంటర్ దగ్గర పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య అరెస్ట్ చేసే సమయంలో కొంత తోపులాట జరిగింది. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడైన బచ్చుల అర్జునుడిని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. పోలీసుల తీరును కొల్లు రవీంద్ర తప్పుబట్టారు. 
 
తాము శాంతియుతంగా ఇక్కడ ఆందోళన చేస్తున్నామని శాంతియుతంగా ఆందోళన చేసే వారిని అరెస్ట్ చేయటం సరికాదని కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజలు ఇసుక కొరత కారణంగా తీవ్రంగా అల్లాడిపోతున్నరని కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కొంతమంది టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇసుక సమస్యపై టీడీపీ పోరుబాట పేరుతో ఈరోజు ఉదయం 9 గంటలకు దీక్షను చేపడతామని నిన్న కొల్లు రవీంద్ర ప్రకటించారు, 
 
కానీ ఈ దీక్షకు అనుమతులు లేవనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ యాక్ట్ 30 ఈ నెల 14వ తేదీ వరకు అమలులో ఉండటంతో అనుమతులు లేకుండా ప్రధాన కూడళ్లలో దీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరికలు కూడా జారీ చేశారని సమాచారం. నిన్న సాయంత్రం కొల్లు రవీంద్ర దీక్ష చేస్తామని ప్రకటించగా పోలీసులు కుట్రను భగ్నం చేశారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: