2019 ఎన్నికలలో రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాలలో 49 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 3 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. చిత్తూరు జిల్లా కుప్పం నుండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుండి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నియోజకవర్గం నుండి పయ్యావుల కేశవ్ ఈ మూడు సీట్లలో విజయం సాధించారు. 
 
రాయలసీమలో వైసీపీ పార్టీ 49 సీట్లు సాధించటం రాజకీయ నిపుణుల్ని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాయలసీమలో దారుణంగా ఉంది. తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఉనికి నిలుపుకోవటానికి చాలా ప్రయత్నాలే చేస్తోంది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పార్టీ మారాలని ప్రయత్నాలు చేసినా పీఏసీ ఛైర్మన్ పదవి రావటంతో పార్టీ మారాలనే ఆలోచన విరమించుకున్నాడు. 
 
ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మరియు వైసీపీ వర్గాలు హిందూపురం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో వైసీపీ విజయం సాధించటానికి ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హిందూపూర్ లో బాలయ్యపై 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ నుండి మహమ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు. 16,000 ఓట్ల మెజారిటీతో బాలకృష్ణ హిందూపూర్ లో విజయం సాధించారు. 
 
త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం సహా అన్ని మున్సిపాలిటీలలోను విజయం సాధించాలని వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ప్రభావం చూపలేకపోతే మాత్రం సీమ జిల్లాలలో టీడీపీ పార్టీకి భవిష్యత్తు కష్టమేనని చెప్పవచ్చు. గడచిన ఐదు సంవత్సరాలలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంత అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వలన 2019 ఎన్నికలలో టీడీపీ పార్టీ రాయలసీమలో ఘోరమైన ఫలితాల్ని అందుకుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: