కీల‌క‌మైన క‌శ్మీర్ అంశంపై చైనా వైఖ‌రి ఆస‌క్తిక‌రంగా మారిన స‌మ‌యంలో....చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న‌కు విచ్చేశారు.  ప్రస్తుతం ఆర్టికల్‌ 370 రద్దుపై పాకిస్థాన్‌కు చైనా అండగా నిలుస్తున్న నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్‌ మధ్య రెండోభేటీ జరుగనుంది. నరేంద్రమోదీ, జిన్‌పింగ్‌ మధ్య జరుగుతున్న రెండో అనధికార భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నాయకులు మొదటిసారి చైనాలోని వుహాన్‌లో గతేడాది ఏప్రిల్‌లో అనధికారికంగా సమావేశమయ్యారు. డోక్లాంలో భారత్‌, చైనా సైన్యాల మధ్య ఘర్షణపూర్వక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ భేటీ జరిగింది. తాజాగా, క‌శ్మీర్ విష‌యంలో చైనా వైఖ‌రి ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


ఇదిలాఉండ‌గా, చెన్నైకి చేరుకున్న జిన్‌పింగ్‌కు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి జిన్‌పింగ్‌ గిండిలోని ఐటీసీ గ్రాండ్‌ చోళ హోటల్‌కు బయల్దేరివెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే మహాబలిపురానికి చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరగనున్న రెండో అనధికార సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మమల్లాపురంలో జిన్‌పింగ్‌కు అక్కడ మోదీ స్వాగతం పలుకుతారు. వీరిద్దరూ కలిసి అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం, పంచ పాండవుల రథాలు, సముద్రం ఒడ్డున ఉన్న ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడే సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించిన అనంతరం మోదీ ఇచ్చే విందును జిన్‌పింగ్‌ స్వీకరిస్తారు. అనంతరం తిరిగి హోటల్‌కు వెళ్తారు. శనివారం ఉదయం జిన్‌పింగ్‌ మళ్లీ మోదీతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పర్యటన పూర్తి చేసుకొని తిరిగి చైనాకు వెళ్లిపోతారు. 


మామల్లాపురం భేటీతో ప‌లు సానుకూల ఫలితాలు రావచ్చని భావిస్తున్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఇండో-పసిఫిక్‌ సమ్మిళిత అభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తారని సమాచారం. జిన్‌పింగ్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించకపోవచ్చని, ఒకవేళ ఆయన అడిగితే.. మోదీ ప్రస్తుత పరిస్థితిని, భారత్‌ వైఖరిని వివరిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.మ‌రోవైపు, ఇద్దరు అగ్రనేతలు రానుండటంతో ఐదువేల మందికిపైగా పోలీసులు, తాత్కాలిక ఔట్‌పోస్ట్‌లు, 800కుపైగా సీసీ కెమెరాలతో భారీ భద్రత కల్పించారు. పట్టణ తీర ప్రాంతంలో రెండు కోస్ట్‌గార్డ్‌ నౌకలను మోహరించారు. బీచ్‌లో బారికేడ్లు నిర్మించారు. గురువారం నుంచే చేపల వేటను నిషేధించారు. వందల మంది కార్మికులను నియమించి ఇక్కడి పురాతన కట్టడాల సుందరీకరణ పూర్తిచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: