మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో పాలు కచ్చితంగా ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే కాఫీ, టీ తయారుచేసేందుకు పాలు తప్పనిసరి. పల్లెల్లో అయితే తాజా పాలు లభిస్తాయి. అదే పట్టణాలు, నగరాల్లో అయితే ప్యాకెట్ పాలే దిక్కు. నగరంలో కూడా కొంతమంది పాల బూత్‌లు ఏర్పాటుచేసి పాలను విడిగా అమ్ముతుంటారు. అయితే మనం వాడే పాలన్నీ నాణ్యమైనవే అనుకుంటే పొరపాటే. అన్ని ఆహార పదార్థాల్లాగానే పాలను కూడా అక్రమార్కులు కల్తీ చేసేస్తున్నారు. గతంలో ప్లాస్టిక్ బియ్యం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతలా టెన్షన్ పెట్టిందో గుర్తుండే ఉంటుంది. తాజాగా హైదరాబాద్‌లో ప్లాస్టిక్ పాలు అమ్ముతున్నట్లు వెలుగులోకి రావడంతో నగరవాసులు ఆందోళన పడుతున్నారు.


 ప్లాస్టిక్ పాలు ప్లాస్టిక్ పాలు మామూలు పాలలాగానే ఉన్నప్పటికీ వాటిని వేడిచేస్తేనే నిజస్వరూపం బయటపడుతోంది. తాజాగా కూకట్‌పల్లిలో ప్లాస్టిక్ పాలు అమ్ముతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రగతినగర్‌‌లో నివసించే పవన్, సౌమ్య దంపతులు శుక్రవారం ఉదయం అందరిలాగే స్థానిక చౌరస్తాలో ఉండే సాయితేజ మిల్క్ సెంటర్‌లో లీటరు పాలు కొన్నారు. వెళ్లి పాలు తెచ్చుకున్న పవన్... ఆ పాలను ఎప్పటిలాగే వేడి చేశారు. అయితే అవి పగిలిపోయాయి. పాలు పగిలిపోవడం సాధారణమే అయినా... పగిలిపోయిన పాలు కాస్త కొత్తగా ముద్దలా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. 


అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఆ ముద్దను ముట్టుకోగా ప్లాస్టిక్‌ మాదిరిగా సాగింది. దీంతో పవన్ మిల్క్‌బూత్‌కి వెళ్లి యజమానిని నిలదీయగా.. ‘నీ దిక్కున్న చోట చెప్పుకో’ బెదిరించాడు. దీంతో బాధితుడు బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అధిక లాభాల కోసం పాలల్లో ప్లాస్టిక్ కలిపి విక్రయిస్తున్నారని, నిలదీస్తే పాలబూత్ యజమాని బెదిరించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: