తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మెతో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేత‌లు తిర‌గ‌లేక‌పోతున్నారు. ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న రోడ్డు షోల‌ను ర‌ద్దు చేసుకుకోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో గులాబీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. రోజురోజుకూ ఆర్టీసీ కార్మికు సమ్మెకు ప్ర‌జ‌ల నుంచి, ఇత‌ర ఉద్యోగ సంఘాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తున్న నేప‌థ్యంలో జ‌నంలోకి వ‌స్తే.. అంద‌రూ నిల‌దీసే ప్ర‌మాద‌ముందన్న భావ‌న‌తోనే కేటీఆర్ త‌న రోడ్డు షోల‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.


అందుకే.. ఈ నెల 18న నిర్వహించ‌నున్న‌ సీఎం కేసీఆర్ కోసం బహిరంగ సభ కూడా జ‌రుగుతుందా..?  లేదా.. అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. హుజూర్‌న‌గర్ ఉప ఎన్నిక‌ను అధికార టీఆర్ఎస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఎలాగైనా గెలిచి, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ప్ర‌భుత్వానికి ఉంద‌నే బ‌ల‌మైన సంకేతాల‌ను ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల‌ని అనుకుంటోంది. కానీ.. అనూహ్యంగా ఆర్టీసీ స‌మ్మె మొద‌లు కావ‌డంతో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. నిజానికి.. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం మొత్తాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీసుకున్నారు.


ఈ క్ర‌మంలో ఈ నెల 4న కేటీఆర్ హుజూర్ నగర్ కు వెళ్లి రోడ్డు షో చేపట్టారు. ఇతర నాయకులతో మాట్లాడి పార్టీ విజయవకాశాలపై చర్చించారు. మళ్లీ ఈ నెల 10 (గురువారం),11 (శుక్రవారం) వరుసగా రోడ్డుషోలు జరపాలని నిర్ణయించారు. అయితే.. ఈనెల 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల స‌మ్మె మొద‌లు కావ‌డంతో ఆ రోడ్డు షోలు రద్దయ్యాయి. ఈ సమాచారాన్ని బుధవారం హుజూర్ నగర్ నాయకులకు చేరవేశారు. అయితే.. హుజూర్‌న‌గ‌ర్‌లో కేటీఆర్ రోడ్డు షోలు ర‌ద్దుకావ‌డానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెనే ప్రధాన కారణమని గులాబీ నేత‌లే గుస‌గుస‌లాడుకుంటున్నారు.


రోడ్డు షోలో కార్మికులు వచ్చి ఆందోళన చెస్తారన్న భయంతోనే రద్దు చేసి ఉంటార‌ని, ప్ర‌చార సమయంలో కార్మికులు వచ్చి నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియదని, ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారితే.. అది కార్మికుల‌ను మ‌రింత రెచ్చ‌గొట్ట‌డ‌మే అవుతుందన్న భావ‌న‌తో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌లు ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఆర్టీసీ స‌మ్మె మ‌రింత ఉదృతం కావ‌డంతో.. ఇక హుజూర్‌న‌గ‌ర్‌కు కేటీఆర్ రావ‌డం క‌ష్ట‌మేన‌ని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్‌  బహిరంగ సభ నిర్వహించాలా.. వద్దా? అనేదానిపై పార్టీ నాయకులు ఊగిసలాడుతున్నారు.ఒక‌వేళ‌.. ఈ నెల 18 లోపు సమ్మె విర‌మిస్తే.. బహిరంగ సభ ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: