తొలిసారి ఎమ్మెల్యే కావడమే...అదృష్టం కొద్దీ మంత్రి పదవి వరించింది. ఆ జిల్లాలో ఎంతోమంది సీనియర్ నేతలున్న ఆయనకే మంత్రి పదవి దక్కింది. అయితే రాజకీయాల్లో జూనియర్ కావడంతో....సీనియర్ నేతలు ఆయన్ని అసలు లెక్క చేయడం లేదు. అసలు మంత్రిగానే ట్రీట్ చేయడం లేదు. అలా సీనియర్ల దృష్టిలో చులకనైపోయిన జూనియర్ మంత్రి ఎవరో కాదు...అనంతపురం జిల్లాకు చెందిన బీసీ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ.


జిల్లాలో పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్న జగన్ బీసీ కోటాలో శంకర నారాయణకే పదవికట్టబెట్టారు. దీంతో జిల్లాలోని సీనియర్ నేతలు కొంత అసంతృప్తిలో ఉంటూ...మంత్రిని అసలు లెక్క చేయడం లేదు. సీనియర్ నేతలతో పాటు, జిల్లాలో ఉన్న ఒకే సామాజికవర్గానికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలుకూడా అసంతృప్తిగా ఉన్నారు. వీరు కూడా తమలో ఎవరోకరికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ అనూహ్యంగా శంకర నారాయణకు దక్కడంతో, వారు కూడా మంత్రిని డోంట్ కేర్ అంటున్నారు.


ప్రతి నామినేటెడ్ పదవిలో తమ సిఫార్సులే అమలు అయ్యేలా చేసుకుంటున్నారు. ఇక తాజాగా జరిగిన ఓ ఘటనని చూస్తే ఆ సామాజికవర్గ ఎమ్మెల్యేలు మంత్రి పట్ల ఎలాంటి తీరు కనబరుస్తున్నారో అర్ధమైపోతుంది. తాజాగా సీఎం జగన్ అనంతపురం జిల్లాలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం హెలిప్యాడ్ వద్ద స్వాగతం చెప్పే విషయంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంత్రితో గొడవకు దిగారు. తనకు ఒకటే పాస్ ఇచ్చి, తన నియోజకవర్గానికి చెందిన ఇతర నేతలకు ఎక్కువ పాసులు ఎందుకిచ్చారంటూ మంత్రిపై మండిపడ్డారు.


అసలు తన నియోజకవర్గంలో ఎందుకు తలదూర్చాలని వాదించారు. దీంతో మంత్రి కూడా ఎదురు తిరగడంతో సీనియర్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సర్ది చెప్పి, వారిని అక్కడ నుంచి పంపించేశారు.  అయితే ఇక్కడ ఎమ్మెల్యే...మంత్రితో వాగ్వాదానికి దిగాల్సినంత పెద్ద ఇష్యూ ఏమికాదు. జూనియర్ మంత్రి కావడంతోనే డైరెక్ట్ గా వాదించారు. అదే ఆయన స్థానంలో ఏ సీనియర్ మంత్రో ఉంటే పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఈ ఒక్క ఇష్యూలోనే కాదు జిల్లాలో రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేల డామినేష‌న్ ఎక్కువుగా ఉండ‌డంతో వారు సైతం ఆయ‌న్ను పెద్ద‌గా లెక్క చేయ‌డం లేద‌ట‌.



మరింత సమాచారం తెలుసుకోండి: