అధికారంలో ఉన్నన్ని రోజులు హడావిడి చేసిన గుంటూరు టీడీపీ ఎమ్మెల్యేలు...అధికారం కోల్పోగానే అడ్రెస్ లేకుండా పోయారు. మంచి ఊపులో ఉన్నప్పుడు పెత్తనాలు చేసిన ఎమ్మెల్యేలు...మాజీలవ్వగానే మాకెందుకులే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కనీసం అధినేతకు మద్ధతిచ్చి...పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనే వదిలేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల్లో గుంటూరులో 17 సీట్లకి గాను టీడీపీ 12 సీట్లు గెలుచుకోగా, వైసీపీ 5 సీట్లు గెలుచుకుంది. అలాగే టీడీపీ మూడు ఎంపీ సీట్లు దక్కించుకుంది.


ఇక మొన్న ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లు గెలిస్తే, టీడీపీ రెండు సీట్లకే పరిమితమైంది. వైసీపీ 2 ఎంపీ సీట్లు గెలుచుకోగా, టీడీపీ గుంటూరు ఎంపీ సీటుని దక్కించుకుంది. దీంతో మాజీలు అయిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు తప్ప,ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే 2014లోటీడీపీ తరుపున గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మొన్న ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళి గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.


అటు మొన్న ఎన్నికల్లో బాపట్ల నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన అన్నం సతీశ్ ఇటీవల బీజేపీలో చేరిపోయారు. ఇక సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరిని పక్కనబెడితే పార్టీలో వేమూరు మాజీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా, ప్రతిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లు కొంచెం  పార్టీలో కనిపిస్తున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేశ్  ట్విట్టర్లో బాగా యాక్టివ్ గా ఉన్నారు.


ఇక చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, వినుకొండ-జీవీ ఆంజనేయులు, తాడికొండ-శ్రవణ్, పొన్నూరు-ధూళ్లిపాళ్ళ నరేంద్ర లాంటి సీనియర్ మాజీ ఎమ్మెల్యేలు కంటికి కనపడటంలేదు. ఉన్నంత‌లో జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న ఆంజ‌నేయులు బెట‌ర్‌.  అటు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కేసుల్లో చిక్కుకుని ఉన్నారు. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి కొంచెం యాక్టివ్ గా ఉండగా, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అడ్రెస్ లేరు.


గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ సమావేశాలున్నప్పుడు కనిపిస్తున్నారు. నరసారావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ‌యోః భారంతో ఇక రాజ‌కీయాల‌కు దూర‌మైన‌ట్టే. బాపట్ల మాజీ ఎంపీ మల్యాద్రి ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. మొత్తానికి కంచుకోటలాంటి గుంటూరులో టీడీపీ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: