తెలంగాణ ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ఉదృతంగా సాగుతున్న వేళ అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అటు ఉద్యోగుల‌తో పాటు ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఎప్పుడేం జ‌రుగుతుందా ? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇక ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు ఉపాధ్యాయ‌, ఉద్యోగ వ‌ర్గాలు మ‌ద్ద‌తు ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. టీఎన్జీవో, టీజీవోల సంఘాల నేత‌లు కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌ల‌తో భేటీ కావాల్సి ఉంది.  ఇలా స‌మ్మె హీటెక్కుతోన్న టైంలో  టీఎన్జీవో, టీజీవో నేత‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి.. సీఎం కేసీఆర్‌ను క‌లిశారు.


వీరు ఆర్టీసీ కార్మిక నేత‌ల‌తో భేటీని ర‌ద్దు చేసుకుని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి కేసీఆర్‌ను క‌ల‌వ‌డంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్క‌డ వారితో మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. వీరికి కేసీఆర్ అనేక హామీలు గుప్పించిన‌ట్టుగా కూడా తెలుస్తోంది. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక త‌ర్వాత ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని, క‌లిసి కూర్చొని మాట్లాడుకుందామ‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన‌ట్టు భోగ‌ట్టా.


తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా సాగుతున్న టైంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేత‌గా శ్రీ‌నివాస్‌గౌడ్ కీల‌క పాత్ర పోషించారు. ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయ‌న స‌మ్మెకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌కుండా ఉద్యోగ సంఘాల‌ను నిల‌వ‌రించేందుకే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల‌ను ఒంట‌రిని చేసి... వారి మాన‌సికంగా దెబ్బ‌కొట్టి అటు కేసీఆర్ ద‌గ్గ‌ర మార్కుల కోస‌మే ఇలా చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఆయ‌న‌పై వ‌స్తున్నాయి.


35రోజుల ముందు స‌మ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికుల‌తో స‌మావేశం కావ‌డానికి సీఎం కేసీఆర్‌కు టైం లేదుగాని... ఒకేసారి టీఎన్జీవోలు, టీజీవోల నేత‌ల‌ను పిలుపించుకుని మాట్లాడేంత టైం ఉందా ? అన్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ డ‌బుల్ గేమ్‌పై సైతం కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తుండ‌డంతో అక్క‌డ రాజ‌కీయ వాతావ‌ర‌ణం హీటెక్కింది.



మరింత సమాచారం తెలుసుకోండి: