ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ వ‌స్త్రాధ‌ర‌ణ విష‌యంలో ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి మోదీ తాజాగా త‌నదైన శైలిలో ఓ దేశాధినేత‌ను ఫిదా చేసేశారు. చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌హాబ‌లిపురం (మామ‌ల్ల‌పురం)లో ఉన్న పురాత‌న ఆల‌యాల‌ను మోదీ, జిన్‌పింగ్‌లు సంద‌ర్శించారు. ఈ టూర్ వెనుక ప‌లు ప్ర‌త్యేక‌త‌లు ఉన్న‌ట్లు స‌మాచారం.ఇక ఈ భేటీలో మోదీ.. త‌మిళ లుక్‌లో అల‌రించారు. పంచ‌క‌ట్టుతో ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ట్టుకున్నారు.


ప‌ల్ల‌వ రాజులు మ‌హాబ‌లిపురాన్ని నిర్మించారు. అక్క‌డ మ‌హాక‌ట్ట‌డాలు ఉన్నాయి. కోర‌మండ‌ల్ తీరంలో ఉన్న రాళ్ల‌తో ప‌ల్ల‌వ రాజులు ఆక‌ర్ష‌ణీయ‌మైన అనేక శిల్పాల‌ను త‌యారు చేశారు. సుమారు 7, 8వ శ‌తాబ్ధ కాల స‌మ‌యంలో ప‌ల్ల‌వులు ఈ ప్రాంతాన్ని పాలించారు. చారిత్రక విశిష్ట‌త‌, మౌళిక స‌దుపాయాల‌ను పూర్తిగా అంచ‌నా వేసిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీనే స్వ‌యంగా మామ‌ల్ల‌పురం వేదిక‌ను ఈ శిఖ‌రాగ్ర భేటీ కోసం ఎంపిక చేసిన‌ట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. రాతి శిల్పాలు ఉన్న ఈ ప్రాంతాన్ని జిన్‌పింగ్‌తో భేటీకి అనువైందిగా ఉంటుంద‌ని మోదీ అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.


ఇదిలాఉండ‌గా, చైనా అధ్య‌క్షుడు బ‌స‌చేసిన చెన్నైలోని గ్రాండ్ చోళా హోట‌ల్ నుంచి మామ‌ల్ల‌పురం వ‌ర‌కు సుమారు 50 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. అయితే చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌.. ఆ రూట్లో కారులోనే ప్ర‌యాణించారు. రోడ్డువైపున వేలాది మంది జిన్‌పింగ్‌కు స్వాగ‌తం ప‌లికారు. భారీ భ‌ద్ర‌త మ‌ధ్య జిన్‌పింగ్‌.. కారులో మామ‌ల్ల‌పురం వెళ్లారు. సుమారు రెండు వేల మంది చిన్నారులు జిన్‌పింగ్ మాస్క్‌లు ధ‌రించి.. చైనా అధ్య‌క్షుడికి స్వాగ‌తం ప‌లికారు. ఇరుదేశాల అధినేత‌లు మ‌హ‌బ‌లిపురంలోని రెడ్‌కార్పెట్‌పై ఇద్ద‌రూ న‌డుస్తూ .. మామ‌ల్ల‌పురం చ‌రిత్ర గురించి చ‌ర్చించుకున్నారు. అక్క‌డ ఉన్న యునెస్కో వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్‌ను సంద‌ర్శించారు. గుహ‌ల్లో కాసేపు తిరిగారు. అర్జునుడు త‌ప‌స్సు చేసిన ప్ర‌దేశం, పంచ ర‌థాలు, షోర్ ఆల‌యాల‌ను కూడా మోదీ, జిన్‌పింగ్‌లు విజిట్ చేశారు. కృష్ణుడి వెన్న‌ముద్ద‌గా పిలువ‌బ‌డే ఓ భారీ శిల‌ ముందు ఇద్ద‌రూ ఫోటో దిగారు.  అక్క‌డ ఇద్ద‌రూ మాట్లాడుకుంటూ.. కొబ్బ‌రినీళ్లు తాగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: