ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌కు నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. ఎరిట్రియాతో ఉద్రిక్తతలను తగ్గించినందుకు గాను అబీ అహ్మద్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది నోబెల్‌ కమిటీ. ఇది వందో శాంతి బహుమతి కావడం విశేషం.


ఎరిట్రియా, ఇథియోఫియా పక్కపక్కనే ఉన్న రెండు దేశాలు. ఎర్రసముద్ర తీరం వెంటున్న ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడూ గొడవే. ఎప్పుడూ రక్తపాతమే. 1998-2000 మధ్య భీకర యుద్ధం జరిగింది. అయినా  పరిస్థితిలో మార్పు రాలేదు. 20 ఏళ్లపాటు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉండేవి. ఏప్రిల్ 2018 తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. శత్రుదేశాలు కాస్త.. మిత్రదేశాలుగా మారాయి. వివాదం సద్దుమణిగింది. ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గాయి. వీటన్నింటికీ కారణం ఒకే ఒక్కడు. ఆయనే  అబీ అహ్మద్‌.


ఏప్రిల్ 2018లో ఇథియోపియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అబీ అహ్మద్‌... రావడం రావడంతోనే ఎరిట్రియా ఉద్రిక్తతలపై ఫోకస్‌ పెట్టారు. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆరునెలల్లోనే  ఇట్రియాతో శాంతి చర్చలు జరిపి విజయం సాధించారు. జైలులో మగ్గుతున్న ఇట్రియాపౌరులను విడుదల చేశారు. అంతేకాదు తమ దేశం చేసిన దానికి క్షమాపణలు చెప్పారు. ఆయన తీసుకున్న  నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. దేశ రూపురేఖలను మార్చేశాయి. 


శాంతి ఒప్పందంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అబీ అహ్మద్‌..2019 నోబెల్‌ శాంతి పురస్కారం ప్రకటించింది కమిటీ. ఈ పురస్కారానికి 223 మంది వ్యక్తులతోపాటు 78 సంస్థలు నామినేట్ అయ్యాయి. 16ఏళ్ల స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం సాగింది. చివరికీ అబీ అహ్మద్‌ను వరించింది. డిసెంబరు 10న ఓస్లోలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు అబీ అహ్మద్‌. ఇది నోబెల్ వందో శాంతి పురస్కారం కావడం విశేషం. ఈ అవార్డు కింద అహ్మద్‌కు ఒక నోబెల్ మెడల్, నోబెల్ డిప్లొమా, 90 లక్షల క్రోనార్ల అంటే  ఆరున్నర కోట్ల రుపాయల నగదు బహుమానం లభించనుంది.


అబీ అహ్మద్ తండ్రి ముస్లిం కాగా తల్లి క్రిస్టియన్‌. తన చిన్నతనంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. కనీసం ఇంట్లో కరెంట్, నీటి సరఫరా కూడా ఉండేది కాదు. ఎక్కడో నదికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చుకునేవారని ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు.  టెక్నాలజీపై మక్కువతో మిలటరీలో రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించారు.  లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. ఇథియోపియా సైబర్ సైయింగ్‌ శాఖకు వ్యవస్థాపకుడు అబీ అహ్మద్. 



మరింత సమాచారం తెలుసుకోండి: