తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 7వ రోజు కొనసాగింది. ప్రభుత్వం ఆర్టీసి కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసిన తరుణంలో.. సమ్మె ఉధృతం చేయాలని జేఏసీ నిర్ణయించింది. అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తోందని ఆర్టీసీ జేఏసీ.  


తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు 7వ రోజూ కొనసాగాయి. మరోపక్క అన్ని కార్మిక సంఘాలు ఆర్టీసి సమ్మెకు మద్దతు ప్రకటించాయి.  సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు డిపోల ముందు ఆందోళనకు దిగారు. భారత మజ్దూర్ సంఘ్ నేతృత్వంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. 


జేఏసి కార్యాచరణ ప్రకారం అందుభాటులో ఉన్న ప్రజాపత్రినిధులకు ఆర్టీసి ఉద్యోగులు వినతి పత్రాలు ఇచ్చారు. తమ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమానికి మద్దతుగా అన్ని పార్టీల కార్యాలయాలకు వెళ్లి.. మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు జేఏసీ నేతలు. బీజేపీ ఆఫీస్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను కలిసి మద్దతు అడిగారు. బీజేపీ కార్మికుల వెంటే ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.  


ఎంపీ రేవంత్ రెడ్డిని కూడా కలిసిన జేఏసీ నేతలు మద్దతు అడిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్ళి టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. త్వరలో అందరితో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు జేఏసీ నేతలు. శనివారం గాంధీ, అంబేద్కర్, జయశంకర్ విగ్రహాల దగ్గర మౌనదీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి ఒకవైపు అన్ని పార్టీల మద్దతు కూడగట్టి, ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసి జాక్ నేతలు. అటు జిల్లాల్లో కూడా ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉధృతంగా జరుగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: