రాఫెల్ కు ఆయుధపూజపై విమర్శలు వస్తున్న తరుణంలో.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ స్పందించారు. బాల్యం నుంచి తనకు ఆచారాలపై విశ్వాసం ఉందనీ, అందుకే పూజలు చేశానని చెప్పుకొచ్చారు. అటు దాయాది దేశం పాకిస్తాన్ కూడా రాఫెల్ కు పూజల్ని సమర్థించింది. అయితే ఆయుధం ఉంటే చాలదనీ, ఉపయోగించే వ్యక్తి కూడా సరైనవాడు అయ్యుండాలని సెటైర్లు వేసింది. 


ఆచారాలు, సంప్రదాయాలపై తనకు బాల్యం నుంచి విశ్వాసం ఉందని చెప్పారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. యుద్ధ విమానాల స్వీకరణ కోసం ఫ్రాన్స్‌ వెళ్లిన ఆయన రెండు రోజుల పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు. రాఫెల్ కు ఆయుధపూజ నిర్వహించడంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై రాజ్ నాథ్ వివరణ ఇచ్చారు. తాను చేసింది తప్పేమీ కాదని.. భవిష్యత్తులోనూ  ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. ఈ విమర్శలపై  కాంగ్రెస్‌లోనూ ఏకాభిప్రాయం ఉండకపోవచ్చునని రాజ్ నాథ్ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌ లేదా మేలో ఏడు  విమానాలు భారత్‌కు చేరుకుంటాయన్నారు.


రాఫెల్ యుద్ధ విమానాలు స్వీకరించిన సందర్భంగా ఆయుధపూజ చేయడంపై.. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆయుధ పూజ డ్రామాగా అభివర్ణించిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే.. బోఫోర్స్ శతఘ్నులు కొన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఇలా చేయలేదని గుర్తుచేశారు. అయితే ఖత్రోచిని పూజకు అలవాటుపడ్డ వారికి ఆయుధ పూజ ఎలా రుచిస్తుందని బీజేపీ కౌంటరిచ్చింది. దసరా రోజు రాఫెల్ కు ఆయుధపూజ చేయడాన్ని పాకిస్తాన్ కూడా సమర్థించింది. మత  విశ్వాసాల ప్రకారం రాఫెల్ కు పూజలు నిర్వహించడంలో తప్పు లేదంది. కేవలం ఆయుధాలు మాత్రమే గెలుపును నిర్ధారించవని.. వాటిని నిర్వహించే వ్యక్తుల  సామర్థ్యం కూడా ముఖ్యమేనని పాకిస్తాన్ అభిప్రాయపడింది. మొత్తానికి రక్షణ మంత్రి వివరణతో ఆయుధ పూజపై విమర్శలకు తెరపడింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: