భారత పర్యటనకు వచ్చిన చైనా అద్యక్షుడు జిన్ పింగ్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ అపూర్వ స్వాగతం పలికారు. బీజింగ్‌ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చిన జిన్‌ పింగ్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి తదితరులు స్వాగతం పలికారు.


తమిళ సంప్రదాయం ప్రకారం జిన్‌పింగ్‌కు స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను జిన్‌పింగ్ ఆసక్తిగా చూశారు. ఆ తర్వాత ఐటీసీ గ్రాండ్‌ చోళ హోటల్‌కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మోడీని కలిసేందుకు మహాబలిపురం వచ్చారు.


మహాబలిపురం చేరుకున్న జిన్ పింగ్ కు భారత ప్రధాని మోడీ భలే షాక్ ఇచ్చారు. ఆయన ఓ భారత్ ప్రధానిలా కాకుండా తమిళ పెద్ద మనిషిలా కనిపించారు. తమిళ పంచెకట్టు, పైన కండువా వేసుకుని దర్శనమిచ్చారు. అటు జిన్ పింగ్ కూడా పెద్దగా అర్భాటం లేకుండా సింపుల్ కానే వచ్చారు. కోటు కూడా లేకుండా తెల్ల షర్టు, నల్ల ప్యాంటుతో వచ్చారు.


మహాబలిపురంలో వెయ్యేళ్ల నాటి కట్టడాలు, చారిత్రక వైభవం, నిర్మాణాల విశిష్టతను జిన్‌ పింగ్‌కు ప్రధాని మోదీ వివరించారు. ప్రాచీన కట్టడాల సముదాయంలో మోడీ, జిన్ పింగ్ నడుచుకుంటూనే తిరిగారు. నరేంద్రమోడీ ఆ కట్టడాల ప్రాముఖ్యతను జిన్ పింగ్ కు వివరించారు. అది ఇద్దరు దేశాధినేతల పర్యటనలా కాకుండా.. ఇద్దరు స్నేహితుల షికారుగా కనిపించింది.


ప్రధాని మోడీ , చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల ఈ సమావేశాన్ని డీడీ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దేశంలోని అన్ని ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారాలు ఇచ్చాయి. కేవలం లైవ్ ఇవ్వడమే కాకుండా ఆసక్తికరమైన వ్యాఖ్యానం కూడా డీడీ అందించడం విశేషం. మొత్తానికి మోదీ, జిన్ పింగ్ సమావేశంలో మోడీ హవా కొనసాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: