సెల్ఫీ.. ఇప్పుడు చాలామందికి అతి ఇష్టమైన పని సెల్ఫీ తీసుకోవడం.. కానీ ఇప్పుడు ఇదే సెల్ఫీ కాసులు కురిపిస్తోంది. అవును మరి.. ఒక సెల్ఫ తీసి పంపిస్తే.. రూ. 51 వేలు మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్న ఆఫర్ భలే ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్ ఇస్తోంది ఏ కార్పొరేట్ సంస్థో కాదు.. సాక్షాత్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం.


అవును మరి.. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలగా ఉన్నారు. అంతే.. ముఖ్యమంత్రి కన్యా వివాహ్-నిఖా యోజన పేరుతో ఓ పథకం ప్రవేశపెట్టారు. ఇది తెలంగాణలో కల్యాణ లక్ష్మి తరహా అన్నమాట. కల్యాణ లక్ష్మికి లబ్దిదారులు బీసీ,ఎస్సీ,ఎస్టీ అయితే చాలు..


ఈ పథకం వర్తించాలంటే.. ఆ ఇంట్లో అంతకు ముందు మరుగుదొడ్డి లేకుండా ఉండాలి. లబ్ది దారులు కొత్త మరుగుదొడ్డి కట్టించుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన వరుడు పెళ్లికి ముందు స్వగృహంలోని మరుగుదొడ్డి వద్ద సెల్ఫీ తీసుకొని పంపిస్తే చాలు... ప్రభుత్వం అతని అకౌంట్లో 51 వేల రూపాయలు నగదు వేస్తుంది.


అంటే మరుగుదొడ్డి కట్టుకుంటే ప్రభుత్వం 51 వేలు సాయం చేస్తుందన్నమాట. అయితే దీనిపై అనేక కామెంట్లు వస్తున్నాయి. కేవలం సెల్ఫీ ఆధారంగా డబ్బు మంజూరు చేయడం కరెక్టు కాదంటున్నారు చాలా మంది. ఈ నిబంధన వల్ల ఏ ఇంట్లోని మరుగుదొడ్డి వద్దయినా సెల్ఫీ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా ఈ పథకం అమలు పకడ్బందీగా లేకపోతే.. భారీగా ప్రభుత్వధనం పక్కదారి పట్టే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ కాన్సెప్టు మాత్రం బావుంది. ప్రజలను ఆకర్షించేలా ఉంది. అందుకే విమర్శలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తే బావుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: