విశాఖ అంటేనే టీడీపీకి కంచుకోట. అది తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరో మారు రుజువు అయింది. మొత్తానికి మొత్తం జిల్లాలో అన్ని సీట్లు వైసీపీ గెలుచుకున్నా కూడా విశాఖ సిటీలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. నాలుగు ఎమ్మెల్యే సీట్లు పసుపు పార్టీ పరమయ్యాయి. అదే ఇపుడు టీడీపీలో ధీమా పెంచితే వైసీపీ ఇక్కడ ప్రతి రోజూ ఓడిపోతోంది.


వైసీపీకి మంత్రిగా అవంతి శ్రీనివాస్ ఉన్నా కూడా ధీటుగా టీడీపీని ఎదుర్కోలేకపోతున్నారు. ఇక వైసీపీకి సిటీలో గట్టి నాయకులు లేకపోవడం మరో లోటు. ఇదిలా ఉండగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు వైసీపీకి కంట్లో నలుసుగా తయారయ్యారు. ఆయన ఇప్పటికి వరసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు.  విజయవాడ నుంచి వచ్చిన వెలగపూడి విశాఖ లిక్కర్ వ్యాపారిగా సెటిల్ అయ్యారు. టీడీపీలో బాలయ్య ద్వారా సీటు సంపాదించి తొలిసారి 2009 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు.


తాజా ఎన్నికల్లో గెలిచిన తరువాత ఊరేగింపులో జగన్ మీద విమర్శలు చేశారన్న దాని మీద ఆయన మీద పోలీస్ కేసు నమోదైంది. ఇక తాజాగా చంద్రబాబు విశాఖ టూర్ సందర్భంగా అనుమతి లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి బైక్ ర్యాలీ నిర్వహించారన్న దాని మీద వెలగపూడి మీద కేసులు నమోదు అయ్యాయి.  అంతే కాదు పోలీసులను దూషించారన్న దాని మీద ఆయన మీద కేసులు పెట్టారు. మరి వెలగపూడి ఏకంగా ముఖ్యమంత్రి  జగన్ మీదనే బాణాలు వేస్తూ వైసీపీకి సవాల్ గా మారారు. ఆయన్ని దారికి తెచ్చేందుకు వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. మరో చింతలపూడిలా కేసులు వెలగపూడి మీద పెట్టి అరెస్టులు చేస్తారా అన్నది కూడా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: