లాజిస్టిక్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్అన్నారు. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని మంగళ్ పల్లిలో నిర్మించిన లాజిస్టిక్పార్కును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను కేటీఆర్ వివరించారు. ఆదిభట్లలో ఇప్పటికే టీసీఎస్ వచ్చిందన్నారు.


ఆదిభట్లలో మరిన్ని ఐటీ సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ శివారు ఎల్బీనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో పెద్ద ప్రయాణ ప్రాంగణలను నిర్మించేందుకు స్థల పరిశీలన జరుగుతోందని వెల్లడించారు. ముచ్చెర్లలో ఫార్మాసిటీ నిర్మాణానికి సహకరించాలన్నారు. కాలుష్యానికి తావులేకుండా ఫార్మాసిటీని నిర్మిస్తామని స్పష్టంచేశారు.


అంతే కాదు.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరికొన్ని లాజిస్టిక్ పార్కులు రానున్నాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ కు దీటుగా వేర్ హౌసెస్, లాజిస్టిక్ రంగం వృద్ధి చెందుతోందని కేటీఆర్ అంటున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో ఇబ్రహీంపట్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు.


హైదరాబాద్ ఇబ్రహీంపట్నం మంగళపల్లిలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులో దాదాపు రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. దీన్ని హెచ్ఎండీఏ, అకా గ్రూపు సంయుక్తంగా నిర్మించాయి. ఈ లాజిస్టిక్ పార్కులో వేర్ హౌసింగ్, ట్రక్ పార్కింగ్, డ్రైవర్లకు విశ్రాంతి గదులు, క్లినిక్, ఫార్మసీ, ఫ్యూయల్ స్టేషన్, ఆటోమొబైల్ రిపేర్ సెంటర్ వంటి సదుపాయాలున్నాయి. 24 గంటలూ సేవలందించే ఈ లాజిస్టిక్ పార్కులో ఒకే సమయంలో 250 ట్రక్కులు పార్కింగ్ చేసుకునే సదుపాయముంది.


మరి కేటీఆర్ మాటలను బట్టి చూస్తే హైదరాబాద్ నగరం నలువైపులా మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మంచి ఊపుమీద ఉంది. ఇక ఇలాంటి ప్రాజెక్టులు ప్రకటిస్తే భూముల ధరలు మరోసారి పెరగడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: