వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న  రైతుభరోసా పథకం ఆదిలోనే అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి . రైతుభరోసా పథకం కింద ఐదు ఎకరాల కు మించి భూమి ఉన్నవారు , ప్రజాప్రతినిధులు , ఇన్ కం టాక్స్ చెల్లించేవారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయరాదని నిబంధనలు చెబుతుండగా , వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఏకంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను రైతు భరోసా పథకం లబ్దిదారునిగా ఎంపిక చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .


ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి , అర్హులైన రైతులకు మేలు చేకూర్చాలని భావిస్తుండగా , అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి  . ఇదే తరహాలో అధికారులు ఇంకా ఎన్ని పొరపాట్లు చేశారోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . రాష్ట్ర మంత్రి పేరే లబ్ధిదారులు జాబితా లో చేర్చిన అధికారులు , ఇక క్షేత్రస్థాయి లో ఎంతమేరకు సక్రమంగా పరిశీలించారో తేటతెల్లం అవుతోందని పలువురు మండిపడుతున్నారు .


 రైతు భరోసా జాబితాలో తన పేరు నమోదుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు . తనకు విషయం  తెలియగానే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి వివరణ కోరినట్లు తెలిపారు . ఘటనపై పూర్తి స్థాయి  విచారణ జరపాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు .  అధికారులు క్షేత్రస్థాయి లో సరిగ్గా  పరిశీలించకపోవటం వల్లే , లబ్ధిదారుల  జాబితాలో పొరపాటుగా తన పేరు చేరి ఉంటుందని ఆయన అన్నారు . 


 పూర్తి స్థాయిలో  పరిశీలించిన తరువాతే తుది జాబితా ప్రకటించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు .  రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పకడ్బందీగా అమలు చేసేందుకు  అధికారులు కృషి చేయాలని ఆదిమూలపు సురేష్ సూచించారు  .


మరింత సమాచారం తెలుసుకోండి: