భాగ్యనగరం క్రమంగా అభాగ్యనగరంగా మారుతున్నది.  నగరంలో ఎక్కడ చూసినా ఇప్పుడు నీళ్ళే కనిపిస్తున్నాయి.  గత పదిరోజులుగా నగరంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.  ఎక్కడ ఎప్పుడు ఎలా వర్షం కురుస్తుందో తెలియక పాపం ప్రజలు ఇబ్బదులు పడుతున్నారు.  వర్షం కురిస్తే.. భరీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది.  ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రజలు సమయానికి గమ్యస్థానాలు చేరుకోలేకపోతున్నారు.  


గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు.  మరోవైపు ఆర్టీసీ స్ట్రైక్.  ఏదో ఒకటి దొరికిన వాహనం పట్టుకొని ఇంటికి వెళ్దాం అని బయలుదేరితే.. ఇంటికి చేరుకునే సరికి ఏ అర్ధరాత్రో అపరాత్రో అవుతున్నది.  పైగా వర్షం కురుస్తుండటం వలన ఇంట్లోకి నీరు వస్తున్నది.  ఇల్లు వాకిళ్లు నీళ్లతో నిండిపోవడం వలన  రాత్రిళ్ళు నిద్రకు కష్టం అవుతున్నది.  


నిన్నటి రోజున అర్ధరాత్రి సమయంలో సైతం వర్షం విస్తారంగా కురిసింది.  ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  నగరంలో కంటే శివారు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిశాయి.  ఈ వర్షం కారణంగా రోడ్లు జలమయం కావడంతో ... ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ఆగిపోయింది.  ఇక నెరేడ్ మేట డివిజన్ లోని బృందావన్ కాలనీలోని పలు ఇళ్లల్లోకి నీరు చేరింది.  ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి చింతలకుంట చెక్ పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జాం కావడం విశేషం.  


ఎండాకాలంలో ఎండలతో మాడిపోయిన నగరం.. వానాకాలంలో వర్షాలతో అల్లాడుతున్నది.  ఎప్పుడు లేనంతగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.  అయితే, ఇలా కురుస్తున్న వర్షం నీటిని ఎలా ఎక్కడ నిలువ చేయాలో తెలియడం లేదు.  నాళాలు పొంగి పొర్లుతుండటంతో.. మ్యాన్ హొల్స్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది.  దీంతో ఎక్కడ ఓపెన్ చేసి ఉన్నాయో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు.   ఇంటి బయటపెట్టిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి.  ఈ పరిస్థితులు ఇంకెన్నాళ్లు ఉంటయో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: