మూడు సంవత్సరాల క్రితం అపరిమిత ఇంటర్నెట్, ఉచిత కాల్స్ తో తక్కువ కాలంలోనే కోట్ల మంది వినియోగదారులకు జియో చేరువ అయింది. కానీ రెండు రోజుల క్రితం జియో వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు  చేసే కాల్స్ కు నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేయనున్నట్లు జియో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతర నెట్‌వర్క్‌లకు  కాల్ చేయటానికి కొత్త రీచార్జ్ ప్లాన్ లను కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 
 
కానీ అక్టోబర్ 9వ తేదీ ముందు ఎవరైతే రీచార్జ్ చేసుకుని ఉంటారో వారు ఆ ప్లాన్ గడువు ముగిసే వరకు ఈ కొత్త టాపప్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదని జియో ప్రకటించింది. వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి పది రూపాయల రీచార్జ్ పై జియో ఒక జీబీ డేటా అదనంగా ఇవ్వనుంది. జియో 10, 20, 50, 100 రూపాయల ఐయూసీ టారిఫ్ ప్లాన్ లను ప్రవేశపెట్టింది. 
 
10 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఇతర నెట్‌వర్క్‌లకు  124 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్, 20 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 249 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్, 50 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 656 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్, 100 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 1362 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ ఇతర నెట్‌వర్క్‌లకు  చేయవచ్చు. జియో వినియోగదారులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాన్ గడువు ముగిసిన తరువాత నెల, మూడు నెలలకు చేసుకొనే ప్లాన్ లను రీచార్జ్ చేసుకొని అదనంగా 10, 20, 50, 100 ప్లాన్ లను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
మరోవైపు ట్రాయ్ ఐయూసీ చార్జీలను ఎత్తివేయాలా లేక కొనసాగించాలా అనే నిర్ణయాన్ని జనవరిలో తీసుకోనుంది. ట్రాయ్ ఐయూసీ చార్జీలను ఎత్తివేస్తే మాత్రం జియో కూడా కస్టమర్ల నుండి ఐయూసీ చార్జీలను వసూలు చేయదు. ప్రస్తుతం జియో నెట్ వర్క్ కు 25 - 30 కోట్ల మిస్డ్ కాల్స్ వస్తున్నాయని జియో కస్టమర్లు 65 - 75 కోట్ల ఔట్ గోయింగ్ కాల్స్ చేస్తున్నారని జియో సంస్థ తెలిపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: