ఎప్పుడూ ఒకే పద్దతా ? గ్లాసులో విస్కీ పోసుకోవటం. అందులో ఐసు ముక్కులు, నీళ్ళు కలుపుకోవటం. దాన్ని షోడాతో మిక్స్ చేయటం. పక్కన స్టఫ్ పెట్టుకుని సిప్ తీసుకోవటం. మందు తాగాలంటే  దశాబ్దాలుగా మందుబాబులు అనుసరిస్తున్న విధానమిదే. అందుకనే మందుప్రియులకు కొత్త అనుభూతిని అందించే ఉద్దేశ్యంతో ’గ్లెవ్లీవెట్’ అనే కంపెనీ మందుబాబులకు కాసింత వెరైటీగా కిక్కు ఇద్దామని అనుకున్నది.

 

అనుకోవటమే ఆలస్యం. స్కాచ్ విస్కీ తయారు చేసే ఈ కంపెనీ విస్కీని క్యాప్సూల్స్ లో నింపేసింది. డాక్టర్లు రిసిచ్చే మందులు ఎలాగూ ఇపుడు క్యాప్సూల్స్, బిళ్ళల రూపంలో దొరుకుతున్నాయిగా. అదే పద్దతిలో పై కంపెనీ విస్కీని కూడా క్యప్సూల్స్ లో నింపేసింది. అంటే క్యాప్సూల్ విస్కీ అన్నమాట.

 

 పై కంపెనీ తయారు చేసిన క్యూప్సూల్ విస్కీని కొనుక్కుని  స్ట్రిప్ లో నుండి ఓ క్యాప్సూల్ ను బయటకు తీసి నోట్లో వేసుకుని కొరికితే చాలు.  ఆ మజానే వేరంటోంది సదరు కంపెనీ. తమ కంపెనీ తయారు చేసిన క్యాప్సూల్ విస్కీని కొంటే షోడాలు, కూల్ డ్రింక్, వాటర్, ఐస్ క్యూబ్ ఏవీ అవసరం లేదని బల్లగుద్ది మరీ చెబుతోంది.

 

ఒక్క క్యాప్సూల్ ను నోట్లో వేసుకుని కొరికితే వెంటనే చిక్కటి ద్రవం నోట్లోకొచ్చేస్తుందట. అదే విస్కీ తాగిన అనుభూతిని, కిక్కును ఇస్తుందని కంపెనీ వివరిస్తోంది. ’డిస్సాల్వబుల్ విస్కీ క్యాప్సూల్స్’ గా పిలిచే ఈ విస్కీని సముద్రపు నాచును పై పొరలుగా వాడుతున్నట్లు కంపెనీ చెప్పింది. పై పొరతో కలిపే విస్కీని మింగేయొచ్చట.

 

పొరను మింగటం వల్ల ఎటువంటి అనారోగ్యం కలగదని కంపెనీ హామీ కూడా ఇస్తోంది. ఈ పొరను మింగిన ఆరు వారాల్లోగా కరిగిపోయి రక్తంలో కలిసిపోతుందని కూడా చెబుతోంది. అంటే ఇపుడు మనం తీసుకుంటున్న పండ్లలోని పీచు పదార్ధం కన్నా తొందరగానే జీర్ణం అయిపోతుందన్నమాట.

 

సరే ఏదెలాగున్న మందుప్రియులు క్యాప్సూల్ ను నోట్లో పెట్టుకుని కొత్త అనుభూతిని పొందమంటే ఒప్పుకుంటారో అన్నది తెలీదు. ఎందుకంటే సంప్రదాయబద్దంగా స్కాచ్ ను తాగటానికే అలవాటుపడిన వారు కొత్త పద్దతిలోకి అంత తొందరగా మారుతారా ? ఏమో చూడాలి కొత్తొక వింత పాతొక రోత కదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: