అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై వరాల వాన కురిపిస్తున్న జగన్ మరో ఎన్నికల హామీని నెరవేర్చాడు. తాజాగా ఏపీ ప్రజల ఆరోగ్యాలపై భరోసానిచ్చి కంటివెలుగు, ఆరోగ్యశ్రీ సేవలపై వరాలు కురిపించిన జగన్, జూనియర్ లాయర్లను కూడా వదలలేదు. ఎన్నికల్లో హామీనిచ్చిన మేరకు జూనియర్ లాయర్లకు నెలకు రూ.5వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామని ప్రకటించారు. ఇకపోతే 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5000 చొప్పున స్టైఫండ్‌ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ హామీ అమలుకు సీఎం జగన్ పచ్చజెండా ఊపారు.


ఈ హామీని నవంబర్ 2వ తేదీ నుంచి అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. కొత్తగా న్యాయవాద విద్యను పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరపడే వరకు.. అనగా మూడేళ్ల పాటు నెలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ జీవోను ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం జారీ చేయనుంది. అర్హులైన జూనియర్‌ లాయర్లకు నవంబర్ 2న నిర్దేశించిన బ్యాంకు ఖాతాల్లో ఆ మేరకు నగదు జమ చేయనున్నారు.


నవంబర్ 3వ తేదీన లబ్ధిదారులకు నగదు జమకు సంబంధించిన రశీదులతో పాటు సీఎం జగన్ సందేశాన్ని గ్రామ వలంటీర్లు డోర్‌ డెలివరీ చేయనున్నారు. దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ, వార్డు వలంటీర్లకు పంపిస్తారు.తనిఖీల అనంతరం అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు, గ్రామాల్లో ఎంపీడీవోలకు పంపుతారు. వారు పరిశీలించాక జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు.


అర్హులైన వారి వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అర్హులైన జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ యువ లాయర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనసున్న మా నాయకుడని జగన్‌ను పొగడ్తలతో ముంచని వారు లేరు. సగటు మనిషి కష్టాలను మానవత్వంతో అర్ధం చేసుకుని ప్రతివారికి మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్న యువనాయకున్ని మనసారా ఆశీర్వదిస్తున్నారు ఏపి ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: