ఎన్నికల ముందు జగన్ పాదయాత్రలో నవరత్నాలలో భాగంగా మద్యపాన నిషేధం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా రాష్ట్రంలోని బెల్టు షాపులను పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే. మద్యపాన నిషేధం అమలులో భాగంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. గతంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వం 20 శాతం మద్యం షాపులను తగ్గించింది. 
 
ప్రస్తుతం ప్రభుత్వం మద్యం అమ్మకాలకు రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తోంది. ప్రభుత్వం రాష్ట్రంలో 800కు పైగా లైసెన్స్ ఉన్న బార్ల వేళలను కూడా కుదించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైతే బార్ల వేళలను కుదించటం లేదంటే పూర్తిగా బార్ల లైసెన్స్ లను రద్దు చేయటం అనే అంశంపై వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని తెలుస్తుంది.

మందుబాబులు ప్రభుత్వ మద్యం దుకాణాలలో రాత్రి 8 గంటల వరకే మద్యం విక్రయిస్తూ ఉండటంతో బార్లకు వెళ్లి మద్యం సేవిస్తున్నారని తెలుస్తుంది. మందుబాబులు బార్లకు వెళ్లి మద్యం కొనుగోలు చేయటం వలన ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. బార్లలో మద్యం విక్రయాలు పెరగటంతో ప్రభుత్వం మద్యపాన నిషేధం లక్ష్యం నెరవేరటం లేదు. బార్ల లైసెన్స్ లు రద్దు చేయాలనే ప్రతిపాదనలు కూడా అధికారులు ప్రభుత్వం ముందు పెట్టినట్లు తెలుస్తోంది. 
 
వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 20 శాతం వరకు మద్యం దుకాణాల్ని తగ్గిస్తూ 2022 సంవత్సరంలోపు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటూ ఉండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బార్ల సమయాన్ని కుదించటం లేదా బార్ల లైసెన్స్ రద్దు చేస్తే మందుబాబులకు మాత్రం షాక్ అనే చెప్పవచ్చు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: