ఆంధ్రప్రదేశ్ లో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టాలని జగన్ సర్కారు నిర్ణయించింది. 2022 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 46 వేల 675 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది.


కనీసం 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ డిజైన్ ఉండాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 46,982 గ్రామీణ ప్రాంతాలకు, 99 పట్టణప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం ప్రాజెక్టును అమలు చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం మొదటి దశలో 37,475 కోట్లు, రెండో దశలో 9,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా 2500 కోట్ల రుణం తీసుకుంటారు.


రాష్ట్రంలోని 110 పురపాలికల్లో 1418.49 మిలియన్ లీటర్ల నీటిని రోజుకు సరఫరా చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రిజర్వాయర్ల నుంచి తాగునీటి అవసరాలకు పైప్‌ లైన్ల ద్వారా నీటి సరఫరా చేసేలా ప్రణాళిక ఉండాలని ఉపసంఘం అధికారులకు సూచనలు జారీ చేసింది. అనంతపురం, చిత్తూరు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ఉపరితల ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని ఉపసంఘం సూచించింది.


రాయలసీమ జిల్లాల్లోని తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారానే తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడింది. నదులు, నీటి వనరులు, రిజర్వాయర్ల ద్వారా వాటర్‌ గ్రిడ్‌కు నీటి లభ్యతను అందించాలని ఉపసంఘం సూచించింది. జలజీవన్‌ మిషన్‌, ఉపాధి హామీ పథకాలను వాటర్ గ్రిడ్ నిర్మాణంలో వినియోగించుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో జలాశయాలు, నదులు, నీటివనరుల లభ్యతపై సమగ్ర అంచనాలు తయారు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: