తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా రెండో ద‌ఫా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం టీఆర్ఎస్ నేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌...బిజీ బిజీగా వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న ఈ పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో పరిశ్రమలను విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఎలిమనేడులో ఏరోస్పేస్ పార్క్ ప్రాజెక్టుకోసం దాదాపు 600 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 


రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు.. అవసరమైన ముడిసరుకులను దిగుమతిచేసుకొనేందుకు మంగళ్‌పల్లితోపాటు బాటసింగారంలో రెండు లాజిస్టిక్ పార్కులకు రాష్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెచ్‌ఎండీఏ-ఆన్‌కాన్ భాగస్వామ్యంతో  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి వద్ద 22 ఎకరాల్లో అందుబాటులోకి వచ్చిన తొలి లాజిస్టిక్ పార్కు ఇదే. మంగళ్‌పల్లి గ్రామంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో పూర్తయిన లాజిస్టిక్ పార్కును మంత్రి కేటీఆర్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ఈ తెలంగాణలో మొట్టమొదటి లాజిస్టిక్‌పార్కు మంగళ్‌పల్లిదేనని.. బాటసింగారంలో సైతం రానున్న మూడు నెలల్లో రెండో లాజిస్టిక్ పార్కును ప్రారంభించనున్నట్టు చెప్పారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఔటర్‌కు ఇరువైపులా మరో ఎనిమిది లాజిస్టిక్ పార్కులను నిర్మిస్తామని తెలిపారు.


హైదరాబాద్‌కు అత్యాధునిక వసతులతో రెండు రైల్వే టర్మినల్స్ వస్తున్నాయని.. వీటిని అనుసంధానం చేసుకొని పరిశ్రమలు, మల్టీ మోడల్ పార్కులు, డ్రైపోర్టులను ఏర్పాటుచేయవచ్చని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు, బుద్వేల్‌లో మరో ఐటీ క్లస్టర్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. హైదరాబాద్ పట్టణం మీద భారంపడకుండా శంషాబాద్, ఎల్బీనగర్లలో ఇంటర్‌సిటీ బస్ టెర్మినల్, మియాపూర్‌లో మరో ఐసీబీటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్టు తెలిపారు. ఆదిబట్లలో ఇప్పటికే టీసీఎస్ కంపెనీ ఉన్నదని.. మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్ ముచ్చర్లలో రానున్నదని.. ఈ ప్రాజెక్టుల ద్వారా యువతకు, స్థానిక పిల్లలకు ఎన్నో ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: