ఎన్నిక‌లు వ‌చ్చాయంటే...రాజ‌కీయ పార్టీలు ఇచ్చే హామీల‌కు అంతుండ‌దు. పైగా అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించే పార్టీలైతే...ఇక చెప్ప‌న‌క్కర్లేదు. అలా అధికారం చేజిక్కించుకోవాల‌ని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కీల‌క‌మైన హ‌ర్యానా ఎన్నిక‌ల్లో భారీ హామీలు ఇచ్చింది. పీజీ నిరుద్యోగ యువతకు నెలకు రూ.10,000, డిగ్రీ నిరుద్యోగ యువతకు నెలకు రూ.7,000 భృతిని అందజేస్తామని పేర్కొంది.వితంతువులు, వికలాంగులు లేదా వివాహం కాని మహిళలకు నెలకు రూ.5100 పింఛన్‌ను అందజేస్తామని ప్రకటించింది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఇస్తామని పేర్కొంది. 


లోక్ సభ ఎన్నికల తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో హ‌ర్యాన సైతం ఓ భాగం. దీంతో లోక్ సభ ఎన్నికల్లో  ప్రదర్శించిన దూకుడును మళ్లీ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో చూపించాలని బీజేపీ ఉత్సాహపడుతోంది. బీజేపీకి బ్రేక్ వేయాలని ప్రతిప‌క్ష కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోంది. ఎన్నో ఆక‌ర్ష‌ణీయ‌మైన హామీల‌ను ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో మేనిఫెస్టో రూపంలో కాంగ్రెస్ తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని, స్థానికులకు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోసం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించింది.


రాష్ట్రంలోని ప్రైవేట్‌ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొంది. రెండు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించింది. 300 యూనిట్లలోపు కరెంట్‌ను వినియోగించే గృహాలకు కూడా ఉచిత విద్యుత్‌ను ఇస్తామని వెల్లడించింది. గర్భిణీలకు మూడో నెల నుంచి ప్రసవం అయ్యే వరకు నెలకు రూ.3100, మహిళ పేరుపై ఇల్లు ఉంటే ఇంటి పన్ను సగానికి తగ్గింపు వంటి ఆస‌క్తిని రేకెత్తించే హామీలు ఇచ్చింది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్.. జన్ ఆశీర్వాద్ యాత్రతో జనంలోకి దూసుకుపోతున్నారు. ఈ యాత్రలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో బీజేపీ లీడర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు చెల్లాచెదురు కావడం కూడా అధికార పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో... కాంగ్రెస్ ఇలా భారీ హామీలు ఇచ్చింద‌ని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: