హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రచార పర్వంలో అన్ని పార్టీలు మరింత దూకుడు పెంచాయి. విజయమో వీర  స్వర్గమో అన్నంత రేంజ్‌లో ఓట్ల వేటలో దూసుకెళ్తున్నాయి. ఉపఎన్నిక ప్రచారానికి కేవలం వారం రోజులు సమయమే మిగిలి ఉండటంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. నాయకుల విమర్శలు...ప్రతివిమర్శలతో హుజూర్‌నగర్‌ బై పోల్ క్యాంపెయిన్ హీట్  పుట్టిస్తోంది. 


హుజూర్‌నగర్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారం ముగియటానికి వారం రోజుల గడువు ఉంది. దీంతో అన్ని పార్టీలు అగ్ర నేతలతో పోటాపోటీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టీఆర్‌ఎస్  ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు తహతహలాడుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు  ఇంచార్జ్‌లు సైతం హుజూర్‌నగర్‌కే పరిమితం అయ్యారు. సీఎం కేసీఆర్‌ను చూసి ఢిల్లీ పార్టీలు వణికిపోతున్నాయన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. హుజుర్‌నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు సిద్ధాంతాలను వదిలిపెట్టాయని ఆయన విమర్శించారు. గరిడేపల్లి మండలం వెలదండలో జరిగిన సభలో పాల్గొన్న జగదీశ్ రెడ్డి...ఓటు అడిగే హక్కు ఉత్తమ్‌కి లేదన్నారు.  


హుజూర్ నగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలని కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు. హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాలను ఉత్తమ్ దంపతులు అభివృద్ధి చేశారని కొనియాడారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తానని కేసీఆర్ ఒక ఎకరానికి కూడా నీరివ్వలేదని అన్నారు హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి. మిషన్ భగీరథ ద్వారా ఎవరికీ నీళ్లివ్వలేదని, నీళ్లు పొందినవాళ్లే ఆ పార్టీకి ఓటేయాలన్నారు. నీళ్లు రాని వారు మాత్రం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. 


అటు టీడీపీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మేళ్లచెరువు మండల పార్టీ అభ్యర్థి కిరణ్మయి తరపున నేతలు ప్రచారం  నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఏ మొహం పెట్టుకుని టిఆర్ఎస్ నాయకులు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. మొత్తానికి... హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారం మరో వారం రోజుల్లో ముగిసిపోనుండటంతో నేతలంతా దృష్టిసారించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: