పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేస్తున్న ఆందోళన చర్చనీయాంశమైంది. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కనిపించడం లేదంటూ ఉదయం 11 గంటల నుంచి ఎమ్మెల్యే నిరసన చేస్తున్నారు. అధికారులు వచ్చేవరకూ మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానంటూ ఆయన దీక్ష ప్రారంభించారు.పాలకొల్లులో ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే నిరసన తెలుపుతున్నారు.

 


పురపాలక సంఘం ప్రత్యేక అధికారి, కమిషనర్ రాకపోవడంతో.. అధికారుల తీరును నిరసిస్తూ కార్యాలయం ముందే నిన్న రాత్రి ఎమ్మెల్యే నిద్రించారు. నిన్నటి నుంచి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కనిపించడం లేదంటూ ఆయన నిరసన చేపట్టారు. ‘అధికారులు వచ్చేవరకూ మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటా. పారిశుద్ధ్యం క్షీణించి ఐదుగురు మృతి చెందినా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు. వైసీపీ పాలన అంతా కక్షలు, కబ్జాలు, కూల్చివేతలు, అక్రమ కేసులే. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదు. ప్రభుత్వ పాలన తీరు మారకపోతే ప్రజా ఆందోళనకు సిద్ధం. ఒక ఎమ్మెల్యే నిరసన చేపట్టి 24 గంటలు అయినా అధికారులు స్పందించకపోవడం శోచనీయం. వైసీపీ మంత్రుల ఆదేశాలను కూడా పట్టించుకోని స్థితిలో అధికారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనను గాలికొదిలేసింది. డెంగ్యూ వ్యాధి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. అధికారులు వచ్చి పారిశుద్ధ్యంపై స్పందించే వరకు నిరసన కొనసాగిస్తా’  అంటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు.

 


నిన్న ఉదయం 11 గంటల నుంచి మున్సిపల్ కార్యాలయంలోనే నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే  రాత్రి అక్కడే నిద్ర, ఉదయం కార్యాలయం బయటే కాలకృత్యాలు తీర్చుకున్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, విద్యుత్, మంచినీటి కష్టాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: