తెలంగాణలో ఈసారి దసరా పండగ కన్నీళ్లనే మిగిల్చింది. ఆనందంగా జరుపుకోవలసిన ఈ పండగను ఎందరో అపసోపాలు పడుతూ ఏదో తూతూ మంత్రంగా ముగించారు. ఓకవైపు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వల్ల తగినంతగా ప్రజారవాణకు సదుపాయాలు లేవు. ఈ దశలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఊర్లకు వెళ్లి, తిరిగిరావడం అనేది ఎవరేస్ట్ శిఖరం ఎక్కినంత సాహాసంగా వర్ణించుకుంటున్నారు. ప్రయాణికుల పండగ కష్టాలు ఎవ్వరికి పట్టనట్లుగా ఇక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకపోతే తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది. తమపట్ల ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని.. సీఎం కేసీఆర్ దిగొచ్చేంతవరకు సమ్మె విరమించేది లేదని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.


ఈ నేపథ్యంలో శనివారం ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షంతో భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కోర్టులో ఉన్న పిటిషన్‌పై 15వ తేదీ తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో బంద్‌పై ఇప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే ఆందోళనలను ఉద్యమ స్థాయికి చేర్చేందుకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం నేత్రుత్వంలో ప్రణాళికలు రచించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆర్టీసీ కార్మికుల సమ్మెలో నేడు బీజేపీ, సీపీఐ, సీపీఎం కూడా పాల్గొననున్నాయి. మరోవైపు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న భవన్ వద్ద కూడా నిరసన తెలుపుతున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇక్కడ తమ కుటుంబ సభ్యులతో కలిసి మౌన దీక్ష చేపట్టారు.


ఇకపోతే తమ నిరసన తెలిపేందుకు హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్‌కు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాలనుండి చేరుకున్నారు. వీరంతా అక్కడున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షకు దిగడంతో ఎంజీబీఎస్ పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు టీఎస్ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలిచాయి. ఆర్టీసీ సమ్మెపై భవిష్యత్తు కార్యాచరణపై ఇవాళ మధ్యాహ్నం మరోసారి అఖిలపక్ష సమావేశం కూడా జరగనుంది. దీనిలో సమ్మెను ఏ విధంగా కొనసాగిచాలనే దానిపై చర్చంచనున్నారు.


ఇక బస్ భవన్ ముట్టడి నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఆందోళనలకు అనుమతి లేదని.. ఒక వేళ కార్మికులు బస్ భవన్ ముట్టడికి ప్రయత్నిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డిపోల ఎదుట ధర్నాకు దిగినా అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు తమకు ఉన్నాయన్నారు.. ఈ నేపద్యంలో పలువురు ఆర్టీసీ కార్మికులు ఘాటువ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, తమ హక్కులకై పోరాడుతున్నామని, ఎవరు ఎన్ని విధాలుగా భయపెట్టిన న్యాయం జరిగే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని నిక్కచ్చిగా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: