సైబర్ క్రిమినల్స్ ఓ యువకుడి కుటుంబాన్ని నిలువునా దోచుకున్నారు. ఏకంగా మూడు కోట్ల లాటరీ తగిలిదంటూ 43 లక్షలకు కుచ్చు టోపీ  పెట్టారు. ఆరు నెలల వ్యవధిలో స్వల్ప మొత్తాల్లో సైబర్ నేరగాళ్ల అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఐతే...ఎంతకీ లాటరీ సొమ్ము చేతికి రాకపోవటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 


పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు ఆగడంలేదు. ఏదో విధంగా ప్రజలను మోసం చేస్తూ సొమ్ము  దోచుకుంటున్నారు. చదువులేనివాడు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయారంటే పాపంలే అనుకోవచ్చు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న యువత సైబర్ నేరగాళ్లకు చిక్కి బుక్కైపోతున్నారు. లేటెస్ట్ గా లాటరీ పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు సైబర్  నేరగాళ్లు. లాటరీలో 3 కోట్లు వచ్చాయన్న మాటలు నమ్మి నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లికి చెందిన గంగిరెడ్డి అనే  వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. 


చదువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన గంగిరెడ్డి కాచిగూడలోని ఓ హాస్టల్‌లో ఉంటూ హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నాడు.  గంగిరెడ్డికి ఓ ఈ-మెయిల్ వచ్చింది. కోకాకోలా కంపెనీ పేరుతో వచ్చిన ఈ-మెయిల్ లో..  సదరు కంపెనీ లాటరీలో 3 కోట్ల బహుమతి వచ్చినట్లుగా  ప్రకటించింది. మీ వివరాలు పంపితే ఆ డబ్బు పంపుతామంటూ ఆ ఈ-మెయిల్ లో ఉంది. దానిని నమ్మిన గంగిరెడ్డి పేరు, చిరునామా, ఫోన్ నంబరు  సహా అన్ని వివరాలను గుడ్డిగా నమ్మి పంపేశాడు. రెండు రోజుల తర్వాత డాక్టర్ నికోలస్ హోగ్లర్ పేరుతో ఓ వ్యక్తి గంగిరెడ్డికి ఫోన్ చేసి లాటరీ  డబ్బు రావాలంటే 23వేలు కట్టాలని కోరారు. 23వేలే కదా? వస్తే 3కోట్లు అని నమ్మిన గంగిరెడ్డి  అతను అడిగిన మొత్తాన్ని అకౌంట్లో వేశాడు. సదరు మొత్తం జమ అయిన తర్వాత నగదు జమైనట్టు కోకాకోలా పేరుతో మళ్లీ మెయిల్ పంపాడు నేరగాడు. అంతే జీఎస్టీ, ఆదాయ పన్ను  అంటూ మరింత అమౌంట్ అడిగాడు. 5లక్షలు కావాలని సైబర్ నేరగాడు అడగగా.. తన వద్ద అంత సొమ్ము  లేకపోవడంతో స్వగ్రామానికి వెళ్లిన గంగిరెడ్డి తండ్రికి విషయం చెప్పాడు. 15-20 రోజుల్లో 3 కోట్ల చెక్కు వస్తుందని, డబ్బు ఇవ్వమని కోరాడు. అంత సొమ్ము  లేదని చెప్పి చివరకు 2 లక్షలు ఇవ్వగా ఆ మొత్తాన్ని మళ్లీ అకౌంట్‌లో వేశాడు.


సైబర్‌ నేరగాళ్లు ఇంతటితో ఆగలేదు. ఆ తర్వాత ఐదు నెలల్లో మరో 10 లక్షలు.. ఇలా మొత్తం 43 లక్షల 22 వేలు సైబర్ నేరగాడికి అప్పగించాడు గంగిరెడ్డి. ఇందుకోసం గంగిరెడ్డి తండ్రితో  బలవంతంగా పొలాన్ని కూడా అమ్మించాడు. 3 కోట్లతో 30ఎకరాలు కొనొచ్చంటూ కొడుకు ఒత్తిడి  చేయడంతో చివరకు పొలం అమ్మి కొడుక్కి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బు అంతా కొడుకు సైబర్ నేరగాడికి అప్పగించాడు. అయితే ఎంతకీ చెక్కు రాకపోవడంతో  అనుమానించిన రైతు కొడుకును నిలదీయగా.. ఫోన్ లో నేరగాడిని సంప్రదించేందుకు ట్రై చేశాడు. ఆ నంబరు స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్టు  గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు అప్పగించగా.. వాళ్లు విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: