ఆర్టీసీని  ప్రభుత్వం లో విలీనం చేసే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చి చెప్పారు.  పొరుగునే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం  లో,  ఆర్టీసీని ప్రభుత్వం లో విలీన చేశారు కదా ? అన్న మీడియా ప్రతినిధుల  ప్రశ్నకు,  పక్కనే ఉన్న వారు తొడ  కోసుకున్నారని ...మనం మెడ  కోసుకోలేం కదా ... అంటూ బదులిచ్చారు  .  అయినా తమ ప్రభుత్వం రైతు బంధు  , రైతు బీమా పథకాలను అమలు చేస్తోందని , మరి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందా ?  అంటూ అయన ఎదురు  ప్రశ్నించారు . ఎవరి ప్రాధాన్యతలు వారికుంటాయని అజయ్ చెప్పుకొచ్చారు .   


ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేస్తామని  తాము ఎప్పుడూ  చెప్పలేదని , తమ ఎన్నికల మేనిఫెస్టో లో కూడా ఆ  హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు . ఆర్టీసీ సమ్మెను యూనియన్ నాయకులతో కలిసి విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న ఆయన , కేంద్రం లోని బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరిస్తుంటే ,  ఆ పార్టీ నేతలు మాత్రం,  రాష్ట్రం లో ఇంకో విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు . కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీ లు అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో అక్కడ ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేశారా ? అంటూ ప్రశ్నించారు .


చర్చల నుంచి యూనియన్ నాయకులు పారిపోయారని , ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న  సమ్మె పై ఇప్పటికే తమ విధానాన్ని స్పష్టం చేశామని , ఇక తమ విధానం లో ఎటువంటి మార్పు లేదని అజయ్ కుమార్  స్పష్టం చేశారు . తాము విధించిన డెడ్ లైన్ లోగా విధులకు హాజరుకాని వారు , వారంతట వారే విధుల్లో నుంచి వైదొలిగారని , ఇక ఇందులో ఎటువంటి మార్పు లేదన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: