అధికారం.. హోదా.. చిటికేస్తే పనులు చేసిపెట్టే మనుషులు.. ఇలా అన్నీ ఉన్నా ఆయన వాటన్నింటినీ పక్కన పెట్టారు.  అది హైకోర్టు ప్రాంగణంలోని తోట!   ఆయన హైకోర్టు న్యాయమూర్తి. 
 ఆయనే స్వయంగా ఎంగిలి పేట్లు ఎత్తారు. ఈ ఘటనకు హైకోర్టు ప్రాంగణం వేదికైంది. శుక్రవారం సాయంత్రం హైకోర్టులో సీని యర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ బదిలీ కావడంతో సహచరులు శుక్రవారం అక్కడ వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. 


పలువురు న్యాయమూర్తులతో పాటు పెద్దసంఖ్యలో న్యాయవాదులు హాజరయ్యారు. అతిథులకు టీ, స్నాక్స్‌ ఏర్పాటు చేయడంతో అందరూ టీ తాగారు.. బిస్కెట్లు.. సమోసాలు తిన్నారు. ఎప్పటి లాగే చాలామంది టీ తాగి గ్లాసులు, స్నాక్స్‌ తిని ఖాళీ ప్లేట్లను అక్కడే పడేశారు. ఇదంతా గమనిస్తున్న జస్టిస్‌ చల్లా కోదండరామ్‌కు మనసు చివుక్కుమంది. న్యాయవాదులుగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలా ఎక్కడపడితే అక్కడ, అది కూడా హైకోర్టు ప్రాంగణాన్ని అపరిశుభ్రంగా మార్చడాన్ని భరించలేకపోయారు.

వెంటనే స్వయంగా వచ్చి ఈ ప్రదేశం మొత్తం తిరుగుతూ పచ్చికపై చెల్లాచెదురుగా పడి ఉన్న ఎంగిలి ప్లేట్లను, ఖాళీ గ్లాసులను ఆయన ఏరడం ప్రారంభించారు. ఆయనను అలా చూసి న్యాయవాదులు ఆశ్చర్యపోయారు. మొదట్లో న్యాయవాదులకు ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాలేదు.సిబ్బందికి పురమాయించకుండా తానే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుండటం అందర్నీ కదిలించింది. 
 ఆ తర్వాత ఎంగిలి ప్లేట్లు తీస్తున్నారని అర్థం చేసుకున్న న్యాయవాదులు వారు ఆయనతో పాటు ప్లేట్లను తీయడం ప్రారంభించారు.

వెంటనే హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సూర్యకిరణ్‌రెడ్డి సహా ఇతర న్యాయవాదులు కూడా జస్టిస్‌ కోదండరామ్‌తో పాటు ఎంగిలి ప్లేట్లను ఏరి, చెత్తకుండిలో పడేశారు. నిమిషాల్లో కోర్టు ప్రాంగణమంతా శుభ్రంగా తయారైంది. ఈ సందర్భంగా జై స్వచ్ఛ భారత్‌ అంటూ నినాదాలు చేశారు. కాగా, తెలంగాణ హైకోర్టు నుంచి పంజాబ్‌- హరియాణ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌కు ఫుల్‌కోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. సంజయ్‌కుమార్‌ సేవలను జస్టిస్‌ రామచంద్రరావు, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కొనియాడారు. అనంతరం న్యాయవాదుల సంఘం ప్రతినిధులు జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ను సన్మానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: