నన్నయ్య వర్సిటీలో ఓ ప్రొఫెసర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై వీసి సురేశ్ వర్మ స్పందించారు. ‘ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరుపుతున్నాం. ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఫిర్యాదు చేసిన వారు 2017-19 బ్యాచ్ విద్యార్థినులు. సీఎంకు చేసిన ఫిర్యాదులో అవాస్తవాలు ఉండటంతో అనుమానాలు కలుగుతున్నాయి. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం’ అని వీసీ సురేశ్‍వర్మ స్పందించారు.

 


ఈ యూనివర్శిటీకి చెందిన కొందరు విద్యార్ధినులు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు తట్టుకోలేక సీఎంకు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ సంఘటనపై సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. దీనిపై విచారణ జరిపించాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీలో ఇంగ్లీషు పాఠాలు బోధించే ప్రొఫెసర్ ఈ చర్యలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో, సాక్షాత్తూ సీఎం రంగంలోకి దిగడంతో యూనివర్శిటీ దిద్దుబాటు చర్యలకు దిగింది. దీనిపై విచారణ జరుగుతూండగా వీసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఓపక్క విద్యార్ధినులు తాము ప్రొఫెసర్ చేస్తున్న లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నామని అంటుంటే.. వీసీ మాత్రం వారు గత బ్యాచ్ విద్యార్ధులనీ.. సరైన ఆధారాల్లేవనీ చెప్పడం సంచలనంగా మారాయి. దీనిపై ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇంకా స్పందించకపోయినా వీసీనే ఈ వాఖ్యలు చేయడంతో ఈ ఉదంతంలో నిజానిజాలు, లోతైన విచారణ మరింతగా జరగాల్సి ఉంది.

 


గత బ్యాచ్ విద్యార్ధినులైనా కానీ.. ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇది యూనివర్శిటీ పరువుకు సంబంధించిన విషయం. ఎందరో విద్యార్దినీ, విద్యార్ధులున్న యూనివర్శిటీ కాబట్టి దీనిని ఉన్నత విద్యాశాఖ మరింత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరముంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు, ఆరోపణలు రాకుండా చర్యలు తీసుకుని యూనివర్శిటీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: