వ‌రుస‌గా రెండో రోజూ....మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కార్యాలయాల్లో సోదాలు కొన‌సాగుతున్నాయి. ఐటీ శాఖ అధికారులు హైదరాబాద్‌తో పాటు ఏపీ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలో ఒకేసారి తనిఖీలు కొన‌సాగిస్తున్నారు. శుక్ర‌వారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపొయే వరకు తనిఖీలు సాగగా...శ‌నివారం సైతం అవి కొన‌సాగాయి. మొత్తం 42 మంది అధికారుల బృందం ఈ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం.


ఐటీ అధికారుల త‌నిఖీల్లో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 25 లో కృష్ణారెడ్డి నివాసంతో పాటు ఆయన ఆఫీస్, జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 10లోని డైమండ్ హౌజ్, ఓ డైరెక్టర్ ఇల్లు, బాలానగర్ లోని మేఘా కంపెనీ ఆఫీసులో సోదాలు చేసిన‌ట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్న కంపెనీకి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుండ‌గా వారికి ర‌క్ష‌ణ‌గా పారామిలిట‌రీ బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపిన‌ట్లు తెలుస్తోంది. వ‌రుస‌గా రెండో రోజు ఉద‌యం మొద‌లుపెట్టిన‌ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని స‌మాచారం.మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో...ఈ తనిఖీలు జ‌ర‌గ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. 


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో  పాటు దేశ వ్యాప్తంగా పలు కీలక ప్రాజెక్టులు మేఘా చేస్తోంది. కాశేళ్వరం  ప్రాజెక్టును కూడా మేఘా కంపెనీయే నిర్మిస్తోంది. ఏపీలో పోలవరం రివర్స్ టెండరింగ్  కూడా మేఘా సంస్థనే దక్కించుకుంది. ఐటీ అధికారులు వ‌రుస‌గా రెండోరోజు తనిఖీల్లో కంపెనీకి చెందిన వివిధ డాక్యుమెంట్లు, కంప్యూటర్లను పరిశీలించినట్టు సమాచారం. ఈ సోదాల‌పై ఐటీ శాఖ వ‌ర్గాలు ఎలాంటి అధికారిక స‌మాచారం విడుద‌ల చేయలేదు. కాగా, ఇవన్నీ సాధార‌ణ త‌నిఖీలేన‌ని  కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మ‌రోవైపు, రెండోరోజు సోదాల గురించి కంపెనీ ఎలాంటి స్పంద‌న వెలువ‌రించ‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: