ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అదిరిపోయే షాకులు త‌గులుతున్నాయి. త్వ‌ర‌లోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఆప్‌లో ధిక్కార స్వ‌రాలు జోరుగా వినిపిస్తున్నాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ ఏకంగా క్లీస్‌స్వీప్ చేసేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల‌కు గాను 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ చ‌రిత్ర‌లోనే ఇదో రికార్డు.


అయితే ఈ యేడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీలో ఉన్న 7 ఎంపీ సీట్ల‌లోనూ బీజేపీ విజ‌యం సాధించింది. అప్ప‌టి నుంచి ఆప్ అధినేత వైఖ‌రిని నిర‌సిస్తూ ప‌లువురు పార్టీని వీడుతున్నారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ కొద్దికాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ సీనియర్ నేత పీసీ చాకో సమక్షంలో ఆమె శనివారంనాడు కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్నారు. ఇక ఆమె బాట‌లోనే ప‌లువురు ఆప్ కీల‌క నేత‌లు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు.


గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఆమె సుదీర్ఘ‌కాలం పాటు కొన‌సాగారు. దివంగ‌త ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి షీలా దీక్షిత్‌తో ఆమెకు ఎన‌లేని అనుబంధం ఉండేది. షీలా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆప్‌లోకి జంప్ చేసేశారు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అల్కా లంబా కొద్దికాలం క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. సామాన్య ప్రజల పార్టీ కాస్తా ఇప్పుడు కొంత మంది ప్రముఖుల పార్టీగా మారిందంటూ అప్పట్లో ఆప్‌పై ఆమె విమర్శలు గుప్పించారు.


ఆ త‌ర్వాత ఆమెకు కేజ్రీవాల్‌కు  ఏ మాత్రం పొస‌గ‌లేదు. ఇటీవల అల్కా లాంబా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. అప్ప‌టి నుంచి ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఆమె కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. పార్టీ మారిన సంద‌ర్భంగా లాంబా మాట్లాడుతూ చాలా రోజుల త‌ర్వాత తిరిగి త‌న సొంత గూటికి చేరుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. ఈ ప‌రిణామాలు కేజ్రీవాల్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: