ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య ప్లాస్టిక్. దీనివల్ల ప్రతి ప్రాణి మనుగడకు పెనుముప్పు పొంచివుంది. మానవ జీవితంలో ప్లాస్టిక్‌ అంతర్భాగంగా, విడదీయరాని బంధంగా మారిపోయింది. ప్రస్తుతం ఎలాంటి వస్తూవులను కొనుగోలు చేయాలన్నా ప్లాస్టిక్‌ కవర్లు తప్పని సరి. దీని వల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతోందని తెలుసు, అయినా కూడా ప్లాస్టిక్‌ ఉపయోగించకుండా ఉండలేకపోతున్నాం. ఈ ప్లాస్టిక్ మానవులకే కాకుండా జంతువులకీ నష్టం కలిగిస్తుంది. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తులను బయట పారేయడం వల్ల చాలా వరకు పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి.


ఇకపోతే భారతీయ శాస్త్రవేత్తలు, తమ పరిశోధనల్లో పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకునే బ్యాక్టీరియాను గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఉన్న ‘శివ్‌ నాడార్‌ యూనివర్సిటీ’కి చెందిన పరిశోధకులు ఈ ఘనత సాధించారు. తమ వర్సిటీ పక్కనున్న తడి భూముల్లో ప్లాస్టిక్‌ను తినే రెండు రకాల బ్యాక్టీరియాను కనుగొన్నట్టు వర్సిటీ జీవశాస్త్ర విభాగం, స్కూల్‌ ఆఫ్‌ నాచురల్‌ సైన్సెస్‌ పరిశోధకులతో కూడిన బృందం ప్రకటించింది. వీటికి ‘ఎక్సిగొ బ్యాక్టీరియం సిబిరికమ్‌ డీఆర్‌-11, ఎక్సిగొ బ్యాక్టీరియం అండే స్ట్రెయిన్‌ డీఆర్‌-14’ అని పేర్లు పెట్టింది. ఇవి ప్లాస్టిక్‌లోని ముఖ్య రసాయన సమ్మేళనమైన ‘పాలియాస్టెరెన్'ను విచ్ఛిన్నం చేసి, దానిలోని కార్బన్‌ను ఆహారంగా తీసుకుంటున్నట్టు వెల్లడించింది.


మేము కనుగొన్న డీఆర్‌-11, డీఆర్‌-14 బ్యాక్టీరియా.. ప్లాస్టిక్‌లోని పాలియాస్టెరెన్ అణువులను ఆవాసంగా చేసుకొని ఆ అణువులపై ఒక జీవపొర మాదిరిగా ఏర్పడుతాయి. అనంతరం అవి విడుదల చేసే ‘హైడ్రోలైజింగ్‌ ఎంజైమ్‌' పాలియాస్టెరెన్లోని కార్బన్‌ అణువుల మధ్య బంధాలను బలహీనం చేస్తుంది. చివరగా ప్లాస్టిక్‌ విచ్ఛిన్నం అవుతుంది’ అని పరిశోధకులు వివరించారు. 


ఇకపోతే ఈ పరిశోధన వల్ల పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్‌ భూతానికి పరిష్కారం దొరుకుతుందని వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పరిశోధకుల బృందానికి సారథ్యం వహించిన రిచా ప్రియదర్శిని తెలిపారు. ప్రస్తుతం తాము ఈ రెండు రకాల బ్యాక్టీరియా జీవక్రియల వేగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తమ పరిశోధన ఫలితాలతో సమీప భవిష్యత్తులో  సహజసిద్ధంగా, సమర్థవంతంగా, వేగంగా, చౌకగా’ ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేయగల ఆవిష్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: