తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 8 వరోజు కొనసాగింది.  సమ్మెలో ఉన్న కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. సమ్మె చట్టవిరుద్ధమని, కార్మికుల్ని క్షమించలేమని తేల్చిచెప్పింది. 


మరోవైపు ఉద్యోగాలు పోతాయనే మనోవేదనకు గురై.. ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపింది. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. 90శాతం కాలిన గాయాలతో ఉన్న బాధితుడిని కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న క్రమంలో శ్రీనివాస్ రెడ్డితో పాటు అతని కుమారుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. 


ఇదిలా ఉండగా ఖమ్మంలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంకటేశ్వరాచారి అనే ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయాడు. అయితే ఆర్టీసీ కార్మికులు సకాలంలో అతనిపై నీళ్లు పోసి కాపాడారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో... కార్మికులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌ ముందు బైఠాయించిన కార్మికులు బస్సుపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు. 
అటు జేఏసీ కూడా సమ్మెను ఉధృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డిపోల దగ్గర మౌన ప్రదర్శనలు జరిగాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 19 వరకు కార్యాచరణ ప్రకటించారు. 19 వ తేదీన తెలంగాణ బంద్ జరపాలని నిర్ణయించారు. 


మరోవైపు ప్రైవేట్ డ్రైవర్లపైనా అక్కడక్కడా దాడులు జరిగాయి. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ జేఏసీ ఎవరూ పట్టు వీడకపోవడంతో.. చివరకు విద్యాసంస్థలకు దసరా సెలవులు కూడా 19వ తేదీ వరకు పొడిగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కూడా సమ్మె కొనసాగితే పరిస్థితి ఏంటనే చర్చ కూడా మొదలైంది. అటు తల్లిదండ్రుల సంఘం కూడా స్పందించింది. సమ్మెకు పరిష్కారం చూపి.. విద్యాసంస్థలు షెడ్యూల్ ప్రకారం తెరవాలని విజ్ఞప్తి చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: