గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఫుల్ యాక్టివ్ గా పని చేసిన ప్రత్తిపాటి పుల్లారావు...మొన్న ఓటమి పాలైన దగ్గర నుంచి పూర్తిగా సైలెంట్ గా అయిపోయారు. గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ప్రత్తిపాటి సడన్ గా సైలెంట్ అయిపోవడం వెనుక గల కారణాలు ఏంటని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్తిపాటి అనూహ్యంగా చిలకలూరిపేట నుంచి మొన్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి విడదల రజని చేతిలో ఓటమి పాలయ్యారు.


ఇక్కడ చెప్పొకదగిన విషయం ఏమిటంటే ఎన్‌ఆర్‌ఐ గా ఉన్న విడదల రజని 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత ప్రత్తిపాటి శిష్యురాలిగా మెలిగిన విడదల సీటు రాదని తెలిసి, వైసీపీలోకి వెళ్ళి ప్రత్తిపాటిని చిత్తుగా ఓడించారు. అయితే ఓటమి వల్ల ప్రత్తిపాటి నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండటం మానేశారు. పార్టీ కార్యక్రమాలకు అప్పుడప్పుడు హాజరవుతున్నారు తప్ప.. పెద్దగా పార్టీని బలోపేతం చేసే పనులు చేయడం లేదు.


అటు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తమని ఇబ్బందులకు గురిచేసిన నేతలనీ వైసీపీ గట్టిగా టార్గెట్ చేసింది. మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్ లాంటి వారి అక్రమాలు బయటపెట్టి కేసులు పెడుతున్నారు. అలాగే ప్రత్తిపాటిపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. గతంలో అగ్రిగోల్డ్ వ్యవహారాల్లో అవతవకలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే ఆయుధాన్ని ప్రత్తిపాటి మీద ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.


ఒకవైపు ఓటమి, మరోవైపు కేసుల భయం ఉండటంతోనే ప్రత్తిపాటి...ఎక్కువగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలోకి వెళ్లిపోతారని కూడా ప్రచారం జరిగింది. బీజేపీలోకి వెళితే వైసీపీ ఇబ్బంది పెట్టదని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికైతే ప్రత్తిపాటి టీడీపీలో కొనసాగుతారని అర్ధమవుతుంది. పరిస్థితులు బట్టి పార్టీ మార్పు గురించి ఆలోచించే అవకాశముంది. ఇప్పటికైతే మౌనం వహిస్తేనే బెటర్ అనుకుంటున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: