ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకోనుంది. ఒకేరోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 15వ తేదీన ఇద్దరు నేతలు సింహపురిలో కాలుపెట్టనున్నారు. అధినేతలు ఇద్దరు ఒకేసారి రానుండటంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  ఇరు పార్టీ నేతలు పోటాపోటిగా అధినేతలకు స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15న రైతుభరోసా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే జిల్లా మొత్తం నేతలు ఈ కార్యక్రమం ఏర్పాట్లుపై ఫోకస్ పెట్టారు. జిల్లా నలుమూలల నుంచి రైతులని జగన్ సభకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఎలాగో అధికార పార్టీ కార్యక్రమం కావడం, వైసీపీకి కంచుకోట జిల్లా కావడం వల్ల జగన్ పర్యటన విజయవంతం అవ్వడం ఖాయం.


అటు ఘోర ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళుతున్నారు. మొన్న ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు గెలుచుకోలేదు. దీంతో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా బాబు..నేతలతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. అయితే బాబు జిల్లా పర్యటనని ఘనవిజయం చేయాలని జిల్లా నేతలు స్వాగత ఏర్పాట్లని ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు.


కాకపోతే ఓటమి తర్వాత  బాబు జిల్లాకు రావడం వల్ల పూర్తి స్థాయిలో నేతలు, కార్యకర్తలు రావడం కష్టమే. నేతలంతా ఓడిపోయాక సైలెంట్ గా ఉండిపోయారు. ఈ సమయంలో బాబు పర్యటన విజయవంతం కాకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే నెల్లూరులో ప్ర‌స్తుతం పార్టీ ఉన్న ప‌రిస్థితులు చూసి ఆ పార్టీ వాళ్ల‌కే పార్టీకి భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న న‌మ్మ‌కాలు లేవు. పైగా ప్రజలు జగన్ పర్యటనపై ఆసక్తికనబరుస్తున్నారు. దీంతో జగన్ పర్యటన ముందు బాబు పర్యటన తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: