టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చిన పని ఏంటి, చేసినదేంటి అన్నది ఇపుడు విశాఖ జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రెండు రోజుల పాటు విశాఖ జిల్లా టీడీపీ సమీక్షా సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు సొంత పార్టీలో ఎంతవరకూ జోష్ పెంచారో తెలియదు కానీ నిద్రావస్థలో ఉన్న వైసీపీని మాత్రం రెచ్చగొట్టిపోయారు. జగన్ చేయలేని పనిని బాబు చేసి ఓ విధంగా ఫ్యాన్ పార్టీని రీచార్జి చేశారని చెప్పాలి.


చంద్రబాబు విశాఖ పర్యటనలో ఎక్కడా తనలోని ఆసహనాన్ని దాచుకోలేకపోయారు. అక్కసుని ఒడిసిపట్టలేకపోయారు. ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోలేకపోయారు. జగన్ మీద జడివాన కురిపించేశారు. తిట్లదండకాన్నే అందుకున్నారు. ఓ సీనియర్ నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన చంద్రబాబు మాటలు తూలి ఒకటి అని  నాలుగు వైసీపీ నేతల చేత అనిపించుకున్నారు.


చంద్రబాబు జగన్ని పిచ్చోడిగా పోల్చడంతో ఒక్కసారిగా విశాఖలోని వైసీపీ నాయకులకు మండుకొచ్చింది. మా జగన్ని ఇంతమాటలు అంటారా అంటూ ఒకరి తరువాత మరొకరుగా మొత్తం మీద కీలకమైన నేతలంతా బాబుని తగులుకున్నారు. అసలైన పిచ్చోడి పాలన చంద్రబాబు అయిదేళ్లలో చూపించారని, అందుకే జనం బాబుని ఇంటికి పంపించారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ఘాటుగా విమర్శలు చేశారు. 


బాబుకు వయసు పెరిగినకొద్దీ స్థాయి దిగజార్చుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ బాణాలు వేశారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత పదవి జగన్ పెట్టిన బిక్ష అని, జగన్ కళ్ళెర్రచేస్తే ఆ పదవి కూడా బాబుకు ఉండదని గుర్తుపెట్టుకోవాలని అవంతి షాకింగ్ హెచ్చరికనే జారీ చేశారు. ఇక వీఎమ్మార్డీయే చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ అయితే చంద్రబాబుని గోబెల్స్ తో  పోల్చారు. బాబు పచ్చి అబద్దాలు అలవాటు చేసుకున్నారని, లేని పోని బురద జల్లుతున్నారని ద్రోణాస్త్రం సంధించారు. మొత్తానికి బాబు టూర్  తరువాత కూడా టీడీపీ శ్రేణులు డీలా పడితే వైసీపీ మాత్రం రీచార్జి అయిందంటున్నారు. దటీజ్ బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: