ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేసిన రెండో రోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రోజుకో విమర్శ చేస్తూ, మీడియాలో హడావిడి చేస్తున్నారు. అయితే ఈ విమర్శల్లో భాగంగానే గత నెలలో చంద్రబాబు, వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, పలువురు టీడీపీ కార్యకర్తలని హత్య చేశారని ఓ మీడియా సమావేశాలు పెట్టేసి గగ్గోలు పెట్టేశారు.


ముఖ్యంగా పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు ఎక్కువగా జరిగాయని, చాలాచోట్ల వైసీపీ వాళ్ళు...టీడీపీ కార్యకర్తలని ఊళ్ళ నుంచి కూడా వెళ్లగొట్టారని ఆరోపణలు గుప్పించారు. పైగా గుంటూరు టీడీపీ ఆఫీసులో వైసీపీ బాధితుల పేరిట పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి, వారి బాధలు ఇవిగో అంటూ మీడియా ముందు హడావిడి చేశారు. ఈ క్రమంలోనే బాధితులని తానే స్వయంగా తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ల దగ్గర దింపుతానని ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు.


అయితే పోలీసులు చంద్రబాబు డ్రామాకి చెక్ పెట్టి, బాధితులం అంటూ టీడీపీ ఆఫీసులో ఉన్నవారిని వాళ్ళ ఇళ్ళకి పంపించేశారు. ఇక బాబు చేసిన ఆరోపణలపై విచారణ చేసిన పోలీసులు తాజాగా అసలు నిజాలని మీడియా ముందు పెట్టారు. పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఓ రాజకీయ పార్టీ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. అలాగే ఆ పార్టీ విడుదల చేసిన బుక్‌లెట్‌లో 8 రాజకీయ హత్యలు జరిగాయని పేర్కొన్నారని, కానీ తమ విచారణలో రాజకీయ హత్యలు కాదని తేలిందన్నారు.


అదేవిధంగా తమ పార్టీ సానుభూతిపరులపై 110 కేసులు నమోదైనట్లు ఆరోపణలు చేశారన్నారు. అది నిజం కాదని, వైఎస్సార్సీపీ కి చెందిన 70 మంది, టీడీపీకి చెందిన 41 మందిపై కేసులు నమోదైనట్లు చెప్పారు. అవి కూడా ఎన్నికల సమయంలో జరిగినవేనన్నారు. అటు పల్నాడులోని ఆత్మకూరు నుంచి 545 మంది ఊరు విడిచి వెళ్లారని బుక్‌లెట్‌లో రాశారన్నారు. పనుల కోసం 345 మంది మాత్రమే గ్రామం విడిచి వెళ్లారని, అందులో 312 మంది వెనక్కి వచ్చినట్లు చెప్పారు. మిగిలిన వారిని కూడా ఫోన్‌లో సంప్రదించామని, పనుల కోసమే వెళ్లినట్లు చెప్పారని తెలిపారు.


అయితే పల్నాడుకు ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ నేపథ్యం ఉందని, ఇప్పుడు రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. మొత్తానికి పోలీసులు నిజాలు బయటపెట్టడంతో అప్పుడు చంద్రబాబు టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ వాళ్ళు దాడి చేసేశారని పనికిమాలిన ఆరోపణలు గుప్పించారని తేల్చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: