పాక్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అడ్డంగా బుక్ చేయ‌నున్నారా? ఇప్ప‌టికే రాజ‌కీయంగా, అంత‌ర్జాతీయంగా, దౌత్య‌ప‌రంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇమ్రాన్‌ను...ఇంకా ఇర‌కాటంలో ప‌డేసే నిర్ణ‌యం మోదీ తీసుకున్నారా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్‌ 8వ తేదీన ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. కారిడార్‌ ప్రారంభోత్సవానికి సంబంధించి ఇంకా తేదీ ఖరారు చేయలేదని అక్టోబర్‌ 10న పాక్‌ వెల్లడించింది. దీంతో పాక్ నాన్చుతుంటే...భార‌త్ ముంద‌డుగు వేసింది. 


పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా నుంచి పాక్‌ భూభాగంలోని సిక్కు పవిత్ర పుణ్యక్షేత్రం దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను ఎలాంటి వీసా లేకుండా కేవలం ప్రభుత్వాల అనుమతితో ఈ ప్రాంతాన్ని భారత సిక్కులు దర్శించుకోవచ్చు. భారత సరిహద్దు నుంచి కర్తార్‌పూర్‌లో గల దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారా వరకు పాకిస్థాన్‌ కారిడార్‌ను నిర్మిస్తుండగా.. పాక్‌తో సరిహద్దు నుంచి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలోని డేరా బాబా నానక్‌ నుంచి భారత్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తోంది. డేరా బాబా నానక్‌ వద్ద కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీని పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ ఆహ్వానించారు. భారత్‌లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి, ప్రధాని తమ సమ్మతిని తెలియజేశారు.ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న గురునానక్‌ 550వ జయంత్యుత్సవాల రోజున   కారిడార్‌ను ప్రారంభిస్తారు.


ఇదిలాఉండ‌గా,కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనాలంటూ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అధికారికంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.  అయితే, పాక్‌ ఆహ్వానంపై తమకు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని మన్మోహన్‌ కార్యాలయం పేర్కొంది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి మన్మోహన్‌ హాజరుకాకపోవచ్చని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: