చంద్రబాబుకు వాడకం బాగా వచ్చు. వాడితే అది అలా ఇలా ఉండదు, సబ్బు అయినా అరిగిపోయిన తరువాత కొంత అనవాలు మిగులుతుంది, కానీ చంద్రబాబు వాడితే మాత్రం అవతల వారి ఉనికే ఉండదు. ఎవరు అవునన్నా కాదన్నా కూడా 2014 ఎన్నికల్లో
పవన్ సాయం లేకపోతే చంద్రబాబు, ఆయన టీడీపీ బతికి బట్టకట్టలేరన్నది నిజం. ఆ తరువాత
పవన్ నిజం తెలుసుకుని సొంతంగా ఎదుగుదామని 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. పార్టీ ఓడిపోయి, పవన్ ఓడినా కూడా ఆయనకు మంచి ఇమేజ్ అలాగే ఉంది.
ఎందుకంటే బేసిగ్గా
పవన్ రాజకీయాలు తెలిసిన వారు కాదు, ఆయనకు ఇది వ్రుత్తి కూడా కాదు. ఆయనకు ఏదో చేద్దామని ఉన్నా సరైన గైడెన్స్ లేక పాలిటిక్స్ లోకి వచ్చి పార్టీ పెట్టి అలా జనంలోకి వచ్చారు. పవన్ ఓడిపోయినా ఆయన మీద ఎక్కడా చెడ్డపేరు లేదు. ఆయనకు ఇప్పటికీ అవకాశాలు తెరచే ఉన్నాయి. ఇప్పటికైనా
పవన్ తన పార్టీని దారిన పెట్టుకుంటే ఆయనకు రాజకీయంగా భవిష్యత్తు ఉంది అనేవారే ఎక్కువమంది ఉన్నారు. దానికి కారణం పవన్ కి ఉన్న సినీ ఇమేజ్, మంచివ్యక్తిగా ఉన్న మరో ఇమేజ్, బలమైన సామాజికవర్గం, యువతలో బీభత్సమైన ఫాలోయింగ్, ఇక ఏపీ రాజకీయాల్లో
జగన్ పార్టీ తరువాత రేపటి రోజున నిలబడే పార్టీగా జనసేనకు ఉన్న అంచనాలు ఇవన్నీ ఇపుడు బాబులో మళ్లీ కొత్త ఆశలు కల్పిస్తున్నట్లున్నాయి.
గాజువాక సీటు సమీక్ష సమావేశంలో బాబు మాట్లాడుతూ తన పార్టీ అభ్యర్ధి ఓడాడన్న దాని కంటే
పవన్ ఓడిపోయారన్న బాధను వ్యక్తం చేయడం విశేషం. పవన్ గెలిచి ఉంటే బాగుండేదని బాబు మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. ఓ విధంగా
పవన్ తో స్నేహాన్ని బాబు కోరుకుంటున్నట్లుగా ఆయన మాటల బట్టే అర్ధవుతోందని తమ్ముళ్లే అంటున్నారు. అంటే పవన్ని మళ్ళీ దువ్వేసి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బాబు అనుకుంటున్నారన్న మాట. మరి
పవన్ 2014లో మాదిరిగానే మరోమారు బాబు వలలో చిక్కుతారా అన్నది చూడాలి.