టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రోమారు ప్ర‌త్యేక రాష్ట్రం యొక్క కీల‌క సెంటిమెంట్‌ను ట‌చ్ చేశారు. ``బొంబాయి..బొగ్గుబాయి...దుబాయి`` పేరుతో తెలంగాణ‌లో ఉపాధి గురించి ప్ర‌స్తావించే అంశాన్ని కేసీఆర్ మ‌ళ్లీ తెర‌మీద‌కు తెచ్చారు. గల్ఫ్ కార్మికుల అంశంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు రాష్ర్టానికి వచ్చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.


గల్ఫ్‌లో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ``తెలంగాణలో చేసుకోవడానికి బోలెడన్ని పనులున్నాయి. హైదరాబాద్‌ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. పనికి మనుషులు దొరక్క వేరే రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకే పొట్ట కూటికోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన తెలంగాణ వారిని రాష్ట్రానికి రప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడే నిర్మాణ రంగంలో ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది`` అని కేసీఆర్ అధికారుల‌కు వివ‌రించారు. ``తిరిగి వ‌చ్చిన‌వారికి నాక్ లో తగిన శిక్షణ ఇస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ, బిల్డర్లతోనూ సంప్రదించి, నిర్మాణ రంగంలో పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇదే విషయాన్ని గల్ఫ్ లో ఉన్న తెలంగాణ బిడ్డలకు స్వయంగా చెప్పడానికి నేనే అక్కడికి వెళతాను’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. త‌న ఆలోచన గురించి మ‌రిన్ఇన అంశాలు పంచుకుంటూ....`` కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. దీనితో పాత జిల్లాలు నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, నల్లగొండలో సగం, రెండు పంటకు నీరు అందించనున్నాం. దీంతో రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి`` అని తెలిపారు.


ఈ అంశాల‌ను వివ‌రించేందుకు  ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో గల్ఫ్‌ దేశాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు. గల్ఫ్‌లోని తెలంగాణ బిడ్డలకు సీఎం కేసీఆర్‌ స్వయంగా వివరించనున్నారట‌. మ‌రి కేసీఆర్ నిర్ణ‌యంపై దుబాయి కార్మికులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. అదే స‌మ‌యంలో ఆయ‌న త‌న దుబాయ్ టూర్‌లో ఎలాంటి హామీలు ఇస్తారనే ఆస‌క్తి సైతం నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: