గాంధీజీ కలలుకన్న స్వతంత్ర భారతదేశం ఇప్పుడు అవినీతితో కంపుగా మారింది. ఎక్కడచూడు, అన్యాయాలు, అవినీతి స్కాంలు. తినే తిండి దగ్గరినుండి పీల్చే గాలి వరకు. అంతా కలుషితమే. చివరకు కడుపులో పెరుగుతున్న బిడ్డపై కూడ విషప్రయోగాలు, కడుపులో వేసుకునే మందుల విషయంలో కూడా కపట నాటకాలు.దొడ్డి దారిలో దోపిడికి నాయకులు గాని అధికారులుగాని ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లుతున్నారు..


బ్రతుక్కి అర్ధమే తెలియని వాడినుండి, బ్రతుకు విలువ తెలిసిన అధికారులవరకు పందికొక్కుల్లా మారి, పేదల పేగులను, కష్టజీవుల కాసులను మెక్కుతున్నారు. సమాజం మారాలి అని అరిచే వారు సమాజం ఎలా మారాలో చెప్పరు. అవినీతి అందంగా అలంకరించుకుని కళ్లముందు తిరుగుతుంటే కపట నీతులు చెబుతూ కాలం వెల్లబుచ్చుతారు. మనకు ప్రాణాలు అర్పించి స్వాతంత్రాన్ని ఇచ్చింది సౌక్యంగా బ్రతకమని, కాని ప్రజల ప్రాణాలతో, జీవితాలతో ఆటలాడమని కాదు. ఇక మనిషి అనారోగ్యానికి గురైతే మొదట పరిగెత్తేది, ఆలయానికి కాదు, హస్పిటల్‌కు ఇలాంటి దవాఖానాల్లో అవినీతి ఎంతలా తాండవిస్తుందో సాక్షాత్తు ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌ నిరూపిస్తుంది.


ఇకపోతే ఈ ఐఎంఎస్ స్కాంలో ఇప్పటికే ఏడుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించిన ఏసీబీ అధికారులు.. మరో నలుగురిని కూడా విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆర్సీపురం ఈఎస్‌ఐ దవాఖాన సీనియర్ అసిస్టెంట్ ముదిమెల సురేంద్రనాథ్‌బాబు, లైఫ్‌కేర్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఎండీ బద్దం సుధాకర్‌రెడ్డి, బాలానగర్‌లోని వెంకటేశ్వర హెల్త్ సెంటర్ నిర్వాహకుడు డాక్టర్ చెరుకు అరవింద్‌రెడ్డి, నాచారం ఈఎస్‌ఐ దవాఖాన ఫార్మసిస్టు కొడాలి నాగలక్ష్మిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.


రెండ్రోజులపాటు నలుగురి కస్టడీకి కోర్టు అనుమతించింది. శని, ఆదివారాల్లో ఏసీబీ అధికారులు వీరిని కస్టడీకి తీసుకుని విచారించనున్నట్టు సమాచారం. ఇక వచ్చే జీతాలు సరిపోవడం లేదో ఏమో అడ్డదార్లు పట్టారు ఉద్యోగులు. మొదట ఈ దారిలో ప్రయాణం ఆనందంగానే సాగింది. కాని ఇప్పుడు దారెంట ముళ్లకంచెలు ముప్పతిప్పలు పెడుతుంటే కనీసం ఎందుకు చేసాం ఈ తప్పు అనే అపరాధభావం కొంచెం ఐనా కలిగితే చాలు,ఇంకా మార్పు రాకుంటే సమాజంలో మార్పుగురించి ఇక ఆలోచించ వలసిన అవసరం లేదని తెలుసుకోవాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: