ఒక భూస్వామి బర్రెలు మరో ఆసామి పొలంలో పడి గడ్డిమేస్తేనే ఊరుకోరు అలాంటిది ప్రజలకు అందవలసిన మందులను భకాసూరుల్లాగా, స్వాహా చేస్తుంటే జరిగే అవినీతి ఎన్నాళ్లు దాగుతుంది.అందుకే ఇన్నాళ్లకు పాపం పండింది. ఆ పాపమే చట్టం రూపంలో కటకటాల్లోకి పంపిస్తుంది. అందుకు నిదర్శనమే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోలు కుంభకోణంలో జరుగుతున్న అరెస్టుల పర్వం అని చెప్పవచ్చూ. పుట్టను తవ్వితే పాములు బయటకు వచ్చినట్లుగా,విచారణ సాగుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటకువస్తున్నాయి.


ప్రైవేటు మందుల కంపెనీలతో కుమ్మక్కై ఐఎంఎస్ ఉద్యోగులు వందల కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన తీరు వెలుగులోకి వస్తున్నది. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారిసంఖ్య 16కు చేరింది. ఇకపోతే శుక్రవారం అరెస్టయిన వారిలో తేజాఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, చర్లపల్లి ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఫార్మసిస్టు వీ లావణ్య, వరంగల్ ఐఎంఎస్ జేడీ కార్యాలయం ల్యాబ్ టెక్నీషియన్ (ఔట్ సోర్సింగ్) మహ్మద్ గౌస్ పాషా ఉన్నారు. తేజాఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డితో చేతులుకలిపి ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులకు ఆధారాలు లభించాయి.


ఢిల్లీలోని ఈఎస్‌ఐ కార్పొరేషన్ నిర్ధారించిన రేటుకు.. కాంట్రాక్ట్ పొందిన ఫార్మా కంపెనీల నుంచే మందులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, నిబంధనల్లో లొసుగులను ఆసరా చేసుకుని డైరెక్టర్ దేవికారాణి.. ఫార్మా లోకల్ కంపెనీ అయిన తేజాఫార్మా నుంచి వాస్తవ ధర కంటే ఎక్కువ చెల్లించి మందులు కొనుగోలు చేశారు. దీనిలో డైరెక్టర్ దేవికారాణి.. తేజా ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డికి రూ.28 కోట్లకు పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చారు. కాగితాల్లోనే వీటిని కొనుగోలు చేసినట్టు చూపి డబ్బులు కాజేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈఎస్‌ఐ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇతర అధికారులతో కలిసి లైఫ్ కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్‌రెడ్డి అవినీతికి పల్పడినట్టు గుర్తించిన ఏసీబీ శనివారం అరెస్ట్ చేసింది.


ఆయన పలువురు అధికారులతో కుమ్మక్కై రూ.8.25 కోట్ల మందులను కొనుగోలుకు సంబంధించి ఆర్డర్ సంపాదించారని నిర్ధారణైంది. ఇదే కేసులో ఆయనతో పాటు కీలకంగా వ్యవహరించిన ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరున్నారనే విషయాలను రాబడుతున్నారు. ఇక తెలిసిన వారిముందు చిన్న తప్పుచేస్తేనే తలవంచుకొని వుంటాం. అలాంటిది ఇన్ని కోట్ల ప్రజలకు తెలిసేలా తప్పుచేసిన వీరు ఎన్ని సార్లు సిగ్గుపడవలసి వస్తుందో అని అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన జనం....

మరింత సమాచారం తెలుసుకోండి: